ఆంధ్రప్రదేశ్‌లోని అధికారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పంట విత్తునుంచి అమ్మకం వరకు ఎన్నో కష్టాలు పడుతున్న వారికి ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే దగ్గరి నుండి పండించిన పంటను మార్కెట్ లో అమ్మేవరకు దళారుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. వారి కష్టానికి ఫలితం అందకుండా వ్యాపారులు, ప్రకృతి విపత్తులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు అండగా నిలబడటానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిర్చి రైతులకు అండగా ఉండి విత్తనాలను అందుబాటు ధరల్లో అందించాలని చూస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులకు అన్ని హైబ్రిడ్, ప్రీమియం రకాల మిరప విత్తనాలు అందుబాటు ధరల్లో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఏపీ సీడ్స్ మిరప విత్తనాల ధరలు భారీగా పెరగడంతో వ్యవసాయ అధికారులు తమ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ రైతులకు మిర్చి విత్తనాలను అందుబాటు ధరలలో ఆర్బీకేల్లో అందిస్తున్నట్లు ప్రకటించారు. ఎక్కడైనా అధిక ధరలకు విత్తనాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తరచూ తనిఖీలు చేపడతామని, రైతులు ఆవేదన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. మిర్చి విత్తనాల వ్యాపారులతో ఏపీ సీడ్స్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని అందుబాటు ధరల్లో ఆర్బీకేల్లో అందిస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన పురుగుల మందును కూడా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు రైతులకు అమ్మినా.. కృత్రిమ కొరత సృష్టించి మిర్చి విత్తనాలను అధిక ధరలకు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించి రైతులకు అధిక ధరల్లో విత్తనాలు అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామని వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. గత సంవత్సరంలో మిరప పంట రికార్డ్ స్థాయిలో దిగుబడి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆదాయం సమకూరిందని తెలిపారు. ఖరీఫ్ లో కూడా అధిక విస్తీర్ణంలో మిర్చి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మిర్చి విత్తనాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. విత్తనాల ధరలు నియంత్రించాలని అన్నదాతలు అధికారులకు విన్నవించారు. దీంతో అధికారులు రైతు భరోసా కేంద్రాల ద్వారా మిర్చి విత్తనాలను రైతులకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి గ్రామంలో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేస్తున్నారు. భూసాపరీక్షలతో ఎరువుల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అర్హులైన రైతులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద యంత్ర సదుపాయాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలని రైతులకు అధికారులు సూచించారు. రైతులు పండించిన పంటను కొనగోళ్లు చేసేందుకు ఆర్బీకేల్లో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరను రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో రైతులు సంప్రదించి.. అక్కడి వ్యవసాయ అధికారుల సాయంతో ప్రభుత్వం మద్ధతు ధర తెలియజేయనున్నారు. రైతులకు ఆర్బీకేల్లో వీఏఏ, వీఆర్‌వో, వీహెచ్‌ఏ లను, వ్యవసాయాధికారి, తహశీల్దార్‌ను సంప్రదించాలని సూచించారు.