ఆంధ్రప్రదేశ్ తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త. ఇక రేషన్ కార్డుపై రాగులు, జొన్నలు తీసుకోవచ్చు. వాటిని త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు ఏపి ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ..రేషన్ కార్డుదారులకు రాగులు, జొన్నలు అందించే విషయమై వాలంటీర్లతో సర్వే చేపట్టామని అన్నారు. రేషన్ కార్డుదారులందరూ రాగులు, జొన్నలు కావాలని కోరానని, తొలుత రాయల సీమ జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు.
దశల వారీగా రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన రాగులు, జొన్నలు అందిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నామన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామన్నారు. 90 శాతం చెల్లింపులు చేశామని, 21 రోజుల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తామని వెల్లడించారు. రంగు మారిన ధాన్యాన్ని మార్చి 15 లోపు కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఏడాది 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, మిల్లర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ. 900 కోట్లు ఉన్నాయని, వీటికి సంబంధించిన పాత బకాయిలన్నీంటినీ ఈ ఏడాదిలో చెల్లిస్తామని ప్రకటించారు. అక్కడక్కడ రైస్ మిల్లర్ల వల్ల సమస్యలు వచ్చాయని, ఇప్పటికే మూడు రైస్ మిల్లులను సీజ్ చేశామని తెలిపారు.
ఇంటింటికీ రేషన్ అందించే ఎంటీయూ బండ్ల వారికి ఇన్సురెన్స్ మొత్తాన్నిరాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, రాష్ట్రంలో మొత్తం 9250 ఎంటియూ బండ్లన్నీ పనిచేస్తూ ఉన్నాయన్నారు. ఏ బండీ ఆగలేదని స్పష్టం చేశారు. అయితే కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేశారని, బండి వద్దే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించామన్నారు. లోపాలు ఉంటే.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేపడుతున్నా.. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని సూచించారు.