గత కొంత కాలంగా అధికార పార్టీ వైసీపీ పై ఎంపీ రఘురామకృష్ణరాజు పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై పరువు నష్టం దావా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని ఏపీ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో దొరుకుతున్న మద్యంలో హానికర రసాయనాలున్నాయని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. నేపథ్యంలో మద్యం శాంపిళ్లను చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్‌లో పరీక్షలు జరిపించారు. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదిక తాజాగా ప్రభుత్వానికి అందింది. ల్యాబ్‌కు పంపించిన శాంపిల్స్ ఏపీ నుంచి సేకరించినవే అనటానికి ఆధారాలు లేవని తెలిపారు. పరీక్ష చేయటానికి ఎక్సైజ్ చట్టం ప్రకారం అనుసరించాల్సిన ఏ నిబంధనను అనుసరించలేదని పేర్కొన్నారు. పరీక్ష చేయమన్నవాళ్లు అడగకపోవటంతో శాంపిల్స్‌ను ఐఎస్ నిబంధనల ప్రకారం చేయలేదని ఎస్‌జీఎస్ స్పష్టం చేసిందని తెలిపారు.
ఇది చదవండి: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయానికి ముస్లిం కుటుంబం భారీ విరాళం..!
చెన్నైలోని ల్యాబ్‌కి పంపించటం వెనుక కారణం ఏంటో తెలియదని, ఎస్‌జీఎస్ తమ లేఖలో శాంపిల్స్‌లో ఏ స్థాయిలో రసాయనాల ఆనవాళ్లు ఉన్నాయో పరీక్షించలేదని పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం ఏపీలో దొరుకుతున్న మద్యంలో ఎలాంటి హానికర రసాయనాలున్నాయని తేలలేదని రజత్ భార్గవ తెలిపారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్న రఘురామరాజుపై పరువు నష్టం దావా వేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు.