సాధారణంగా అందరు తమ వివాహం, గృహ ప్రవేశం, పుట్టిన రోజు వంటి వంటి వేడుకలకు, ఇతర శుభకార్యాలకు ఆహ్వాన పత్రికతో బంధువులను పిలుస్తుంటారు. కానీ నా మరణ దిన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాను, మీరు తప్పకుండా రావాలని అని ఎవరైన ఆహ్వానిస్తారా? అయితే అలాంటి పనే చేశారు ఓ వ్యక్తి. తనకు మరణం ఎప్పుడు వస్తుందో ఊహించుకోని.. బతికుండగానే ఆ రోజున ఏటా వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ వ్యక్తి. అంతేకాక సదరు వ్యక్తి ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించుకున్నారు. ఈ చిత్రమైన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే డాక్టరు పాలేటి రామారావు. చీరాలకు చెందిన ఆయన తెదేపా హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అలానే రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.
పాలేటీ రామారావు అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీ హాయంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ప్రజల్లో ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి ఇలాంటి విచిత్రమైన ఓ ఆహ్వాన లేఖను ముద్రించారు. తన మరణ దిన వేడుకకు రమ్మంటూ తన అభిమానులకు ఆహ్వాన లేఖ పంపారు. బాపట్ల జిల్లాలోని చీరాల ఐఎంఏ హాల్ లో శనివారం ఉదయం 10 గంటలకు జరిగే తన మరణ దిన వేడుకలకు హాజరవ్వాలని పాలేటి రామారావు అభిమానులను కోరారు.
ఏపీ మాజీ మంత్రి పాలేటి రామారావు పంపిన ఆ ఆహ్వాన లేఖలో ఏం రాశారంటే..” నేనేంత కాలము జీవించాలనుకుంటున్నానో ఆలోచించి, మరణానికి ఒక తారీఖును నిర్ణయించి, ఇప్పటికే ఎంతకాలం జీవించానో, ఇంకా ఎంతకాలం మిగిలి ఉందో లెక్కించి.. నా మరణ దినాన్ని జరుపుకుంటున్నాను. ప్రతి ఏటా జరుపుకునే పుట్టిన రోజు వేడుకలు అర్థ రహితమని తెలుసుకున్నాను. అందుకే ఈ నా మరణ దిన వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నాను. అందుకే నా మరణ సంవత్సరాన్ని 2034 గా నిర్ణయించుకున్నా. అంటే మృత్యువుకి ఇంకా 12 ఏళ్లు ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏటా మరణదిన వేడుకలు జరుపుకుంటాను. ఆ వేడుకలకు మీరందరూ హాజరై, నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్న. ఇట్లు.. మీ పాలేటి రామరావు” అంటూ రామారావు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఆయన మాట్లాడుతూ.. పుట్టిన ప్రతీ మనిషి మరణించక తప్పదని, అయితే బతికి ఉన్నంత కాలం ఇతరులకు మన సామర్థ్యం మేరకు సాయం చేయాలే తప్ప కీడు చేయొద్దని మాజీ మంత్రి తెలిపారు. భగవంతుడు ఎంత బోధించినా మనిషి తన జీవన విధానాన్ని, ఆలోచనను పూర్తిగా సరిచేసుకోవడంలేదని అన్నారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి రామరావు పంపిన ఈ ఆహ్వాన లేఖ ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.