దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ మరోసారి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అలానే ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధృడ నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రంకి’ అనే కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈక్రమంలో గత మూడు రోజుల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగం చేసే యువకులు తనకు షేర్ ఇవ్వాలని అన్నారు. తన వలనే ఐటీ జాబ్స్ వచ్చాయి కాబట్టి.. ఐటీ ఉద్యోగులు తమ జీతాల్లో షేర్ ఇవ్వాలంటూ ఆసక్తిర కామెంట్స్ చేశారు.
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక స్థానం ఉంది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చంద్రబాబు చవిచూశారు. ఎందరో రాజకీయ ఉద్దండులను ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు గడ్డుకాలం నడుస్తోందని చెప్పాలి. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల ముందు నిలవలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తోన్నాయి. పర్యటనల్లో ఆయన చేసే వ్యాఖ్యలు ఆ వాదనలకు బలాన్ని చేరుకూరుస్తున్నాయి. గతంలో నిర్వహించిన ఓ సభలో వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలంటూ, కాబట్టి తప్పక గెలిపించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలపై అధికార వైసీపీ ఓ రేంజ్ లో రియాక్ట్ అయింది.
దీంతో అదే మాటలను మారుస్తూ.. వచ్చే ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు కావని, ప్రజలకే ఇది చివరి అవకాశం అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలపై కూడా అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఆయనకు మైండ్ సరిగ్గాలేనట్లుందని, ప్రజలకు చివరి అవకాశం ఏంటంటూ.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఇలా ప్రతి సభలోను చంద్రాాబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు అందరిని విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఐటీ ఉద్యోగులపై పలు వ్యాఖ్యలు చేశారు.
సభలో చంద్రబాబు మాట్లాడుతూ..”నేను ఐటీని స్థాపించాను. అది నేర్చుకుని కొందరు అమెరికా, ఆస్ట్రేలియా, హైదరాబాద్ లకు వెళ్లారా? లేదా? అక్కడ డబ్బులు బాగా సంపాదిస్తున్నారా? లేదా?. మీ ఇంట్లో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉంటే ఒకమాట చెప్పండి. నాకు రాయల్టీ పే చేయాలి. మాములుగా 15 వేల ఆదాయం వచ్చే వారికి లక్షలు, కోట్లు సంపాదించే మార్గం చూపించిన నాకు.. ఒక్క శాతమన్న రాయల్టీ ఇవ్వాలి కదా. పార్టీ ఫండ్ గా మీ జీతాల్లో షేర్ ఇవ్వాలి కదా? నా ఆలోచన ఒకటి మళ్లీ యువకులు రాజకీయాలో యాక్టీవ్ గా పనిచేయాలి. ఈ యువ శక్తి రాబోయే 25 ఏళ్ల మన రాష్ట్ర సొంతం. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలి” అంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంకా మాట్లాడుతూ.. ఒక సైకో చేతుల్లో రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. ఏ తప్పు లేకపోయినా అమరరాజా బ్యాటరీస్ పై కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. కేసులపై కేసులు పెడుతూ మాజీ మంత్రి నారాయణను వేధిస్తున్నారని ఆయన చెప్పారు. సీఎం పదవి తనకు కొత్తా? అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలను సీఎం జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారన్నారు. పరదాలు, పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ సీఎం పాలన చేస్తున్నారని అన్నారు. ఏ ఒక్క రంగాన్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. వ్యవస్థలన్నింటిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఐటీ ఉద్యోగులను.. వారి జీతాల్లో నుంచి షేర్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మాటలపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.