నేటి సమాజంలో నిజాయితీ అనేది కనుమరుగైపోతుంది. ముఖ్యంగా అవినీతి సొమ్ము కోసం ఆరాటపడే వాళ్లు బాగా పెరిగిపోయారు. చిన్నపిల్లలకు అందించే ఆహార పదార్ధాల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ప్రతి దానిలోనూ అవినీతికి పాల్పడుతున్నారు. పసి పిల్లల కోసం ఏర్పాటు చేసిన అంగన్ వాడీ కేంద్రాల్లో కూడా దోచుకునే వారు పెరిగిపోయారు. పిల్లల కోసం ప్రభుత్వం అందించే ఆహార పదార్ధాలు, పాలు ఇతర వస్తువులను అంగన్ వాడీలో పని చేసే వారిలో కొందరు దొడ్డి దారిన బయటకు తరలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు బయట పడుతుంటాయి. తాజాగా ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ కుమార్ రెడ్డి తనిఖీ చేసిన ఓ అంగన్ వాడీ సెంటర్ లో బయటపడింది. దీంతో అక్కడ పనిచేసే టీచర్లపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ కుమార్ రెడ్డి తరచూ వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అంగన్ వాడీ కేంద్రలో ఈ మధ్యకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అంగన్ వాడీలో పనిచేసే కొందరిని ప్రశంసించగా, అవినీతికి పాల్పడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ అంగన్ వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో అక్రమాలకు పాల్పడిన వారికి మెమోలు జారీ చేశారు. మొదట అంగన్ వాడీ కేంద్రానికి తనిఖీకి వెళ్లిన ఆయన.. అక్కడి పిల్లలకు చాకెట్లు అందజేశారు.
అనంతరం అక్కడే వండిన ఆహారాన్ని తిని.. ఇంకా మెరుగుపర్చుకోవాలని సలహా ఇచ్చారు. తనిఖీల సమయంలో అక్కడ ఓ బ్యాగ్ లో 13 లీటర్ల పాలు అదనంగా కనిపించాయి. అదనంగా ఇన్ని పాల ప్యాకెట్లు ఎందుకు ఉన్నాయ అంటూ అక్కడ పనిచేసే వారిని ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. మీకు అదనంగా ఎలా వస్తాయి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వివిధ రకాల కారణాలు చెప్తుండగా.. హరికథలు చెప్పే వారికి చెప్పండి.. తనకు కాదంటూ సీరియస్ అయ్యారు. పిల్లల తిండి విషయంలో ఇలా చేయడం చాల తప్పని, దేవుడనే వారు చూస్తుంటారని ఆయనకు కూడా సమాధానం చెప్పాలి వస్తుందని తెలిపారు.
పిల్లల కోసం తెచ్చినవి మీరు పక్కన పెట్టుకుని.. అమ్ముకోవడమో లేదా మీరే తాగడమో చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తల్లి మనస్సుతో ఆలోచించాలని, ఇక్కడ ఉండే పిల్లలను మీ పిల్లలుగా భావించాలని హితబోధ చేశారు. మీ దగ్గర ఉండే బుక్ లోని స్టాక్ రిపోర్టు కంటే అదనంగా పాలు ఉన్నాయని, పుస్తకంలో ఏం ఉందే.. అదే కనిపించాలి కాదా? అంటూ వారి ప్రశ్నించాడు. వారికి మెమోలు జారీ చేయాలని అధికారులను ఆదేశించాడు. మరి.. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.