ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సరే పీఆర్సీ అనంతరం వేతనాలు పెరుగుతాయి.. కానీ ఏపీలో మాత్రం పీఆర్సీ ప్రకటన అనంతరం జీతాలు తగ్గుతున్నాయిని.. అసలు ఇదేం పీర్సీ అని ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని కోరుతూ.. ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. అంతేకాక పీఆర్సీకి జీవోకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు రోడ్లమీదకొచ్చారు. ఈ క్రమంలో కలెక్టరేట్ల ముట్టడితో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందని ప్రకటించిన పోలీసులు.. ఎక్కడికక్కడ ఉద్యోగులను గృహ నిర్బంధం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఏపీ పీఆర్సీ వల్ల ఉద్యోగులకి లాభమా? నష్టమా?
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై పలు ఉద్యోగ సంఘాల నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ వల్ల జీతాలు ముమ్మాటికీ తగ్గుతున్నాయని తెలిపారు. మూడు జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 21 లోపు పీఆర్సీ జీవోలను రద్దు చేయకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ నిరవధిక సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. దీని గురించి జేఏసీ సమావేశం అనంతరం నోటీసులు ఇస్తామని తెలిపారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.