ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కుల ధ్రువీకరణకు సంబంధించిన కేసు విచారణను ఏపీ హైకోర్టు వారం రోజులపాటు వాయిదా వేసింది. కుల ధ్రువీకరణ విషయంలో ‘అప్పీల్ అథార్టీ’ విచారణకు సంబంధించి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కేసులో నిన్న హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె కుల ధ్రువీకరణకు సంబంధించి వాస్తవం తేల్చాలంటూ న్యాయవాది రేగు మహేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. కాగా, జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఆమె ఎస్టీ అని తేల్చిందని పేర్కొన్నారు. పుష్పశ్రీవాణి ఎస్టీయే అని ఆ కమిటీ మే 9న ఉత్తర్వులిచ్చిందన్నారు. వాటిపై పిటిషనర్ జూన్ 10న అప్పీల్ దాఖలు చేశారని తెలిపారు. కుల ధ్రువీకరణ విషయంలో మంత్రి తానే విచారణ చేయించడం చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఏపీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఈ నేపథ్యంలో ఏపీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథార్టీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించండి అని కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి జస్టిస్. ఎం.సత్యనారాయణమూర్తి పత్రాలను పరిశీలిస్తే.. ఛైర్మన్/ గిరిజనశాఖ ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర స్థాయి పునఃసమీక్ష కమిటీ) వద్ద అప్పీల్ దాఖలు చేసినట్లు ఉందన్నారు. అప్పీల్‌ను ఉపసంహరించుకొని సంబంధిత అథార్టీ ముందు దాఖలు చేసుకోవాలని సూచిస్తూ.. ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.