విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఏపీలో 13 జిల్లాలను కాస్త.. 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే మరో కొత్త జిల్లా కూడా ఏర్పాటు కానుందని డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..
పరిపాలన సౌలభ్యం కోరకు.. పెద్ద జిల్లాలను విడదీసి.. చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉందంటున్నారు డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనకు అనువుగా మరో జిల్లా ఏర్పాటుపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. గిరిజనులకు పాలన అందుబాటులో ఉండేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. రానున్న కాలంలో మూడో జిల్లా కూడా ఏర్పాటు కానుందని.. .. దీనిపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త జిల్లా ఏర్పాటు గురించి వ్యాఖ్యలు చేశారు. పార్వతీపురం జిల్లాకు సంబంధించి ఈ ఏడాది ప్రగతిని డిప్యూటీ సీఎం వివరించారు. జిల్లాకు సంబంధించి నూతన కలెక్టరేట్, వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించామని.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు జిల్లాకు రూ.600 కోట్లతో వైద్య కళాశాల మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం కింద 21,353 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం వస్తోందని.. పూర్తిస్థాయిలో అభివృద్ధికి కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.
అయితే మరో కొత్త జిల్లా ఏర్పాటు గురించి డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. గతంలో మంత్రి పేర్ని నాని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 27వ జిల్లా ఏర్పాటవుతుందని చెప్పారు. గిరిజన ప్రాంతాలను రెండు జిల్లాలుగా చేశారని.. మరో జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు అప్పట్లోనే పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.