అన్నదాతలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీని రైతుల అకౌంట్లలో జమ చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి అన్నదాతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు గతంలో సాంకేతిక కారణాలతో చెల్లింపులు పొందని వారి ఖాతాల్లో మొత్తం రూ.199.94 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
రబీ 2020–21 సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ. 45.22 కోట్లు, ఖరీఫ్-2021 సీజన్ లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ కింద రూ.115.33 కోట్లు జమ చేశారు. అదే విధంగా ఖరీఫ్-2022 సీజన్ లో జూలై నుంచి అక్టోబర్ మధ్య గోదావరి వరదలు, అకాల వర్షాలవల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ రంగంపై 62 శాతం జనాభా ఆధారపడి ఉన్నారు. రైతులను అన్నిరకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుంది. గత ప్రభుత్వ హయాంలో అంతా గందరగోళమే. అశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా వేసేవారు. రైతన్నలు.. క్షేత్రస్థాయి ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్థితి ఉండేది. కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఎగ్గొట్టి, మరికొన్ని సందర్భాల్లో రెండు మూడు సీజన్ల తర్వాతే అరకొరగా సాయం అందించేవారు’.
‘కానీ, ప్రస్తుతం ఈ–క్రాప్ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులకు క్రమం తప్పకుండా పరిహారం చెల్లిస్తున్నాం. గడిచిన మూడేళ్లలో 65.65 లక్షల మందికి రూ.1,282.11 కోట్ల సున్నా వడ్డీ రాయితీ సొమ్ము జమ చేశాం. తాజాగా జమచేయనున్న మొత్తంతో కలిపి 73.88 లక్షల మంది రైతన్నలకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ రాయితీ అందినట్లు అవుతుంది. గడిచిన మూడేళ్ల ఐదు నెలల్లో వివిధ పథకాల కింద రైతన్నలకు రూ. 1,37,975.48 కోట్ల సాయం అందింది..’ అని వైఎస్ జగన్ తెలిపారు. అయితే ఈ నగదు పొందేందుకు అర్హులో కాదోనన్న విషయాన్ని తెలుసుకునేందుకు రైతులు తమ తమ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకోవచ్చునని అధికార వర్గాలు వెల్లడించాయి.