ప్రభుత్వ రంగ సంస్థలు, అధికారులను ఎప్పుడూ అవినీతి అనే పదం వెంటాడుతూ ఉంటుంది. అయితే అవినీతి అనే ఆలోచన కూడా రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆఫీస్, ఎమ్మార్వో, ఎండీవీ, ఆర్డీవో కార్యాలయాలతో పాటు ఇంకా ఎక్కడెక్కడ అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉంటుందో అన్ని ఆఫీసులపై దృష్టి సారించాలని సూచించారు. అవినీతిలేకుండా పారదర్శకంగా సేవలు అందేలా చూడాలంటూ ఆదేశించారు.
పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో పన్నుల వసూళ్లు, నాణ్యమైన సేవలకు సంబంధించి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగా ప్రభుత్వ రంగ సేవల్లో పారదర్శకత, అవినీతి నిర్మూలనపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి సంబంధించి ఇప్పటికే పరిచయం చేసిన ఏసీబీ నంబర్ ‘14400’ సర్వీసుకు విస్తృత ప్రచారం కల్పించాలంటూ కోరారు.
పోస్టర్లు వేయించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు కనిపించేలా ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. ఈ కాల్ 14400 సర్వీసుపై ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ కోరారు. ఇప్పటికే అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్ లో ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా ఫిర్యాదు చేసేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాల్ 14400కి విస్తృత ప్రచారం కల్పించాలంటూ ఆదేశించారు. 14400 సర్వీసుకు వచ్చిన ఫోన్ కాల్స్ కు సంబంధించి తీసుకున్న చర్యలను కూడా పక్కాగా నివేదిక ఉండాలని ఆదేశించారు.
ప్రస్తుతం సీఎం జగన్ చేపట్టిన చర్యలను సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ కొమురం పులి సినిమాకి లింక్ చేస్తున్నారు. ఆ సినిమాలో ప్రతి పోలీస్ స్టేషన్ ముందు కాయిన్ బాక్స్ పెట్టి రూపాయి వేసి ఫిర్యాదు చేస్తే.. నిమిషాల్లో వచ్చి వారి సమస్యపై చర్యలు తీసుకుంటారు. అలాగే సీఎం జగన్ కూడా ప్రభుత్వ రంగ సేవల్లో అవినీతి నిర్మూలనకు అలాంటి వేగవంతమైన, పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రశంసిస్తున్నారు. ‘కాల్ 14400’ సర్వీసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.