ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్నీ జలమయం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. తాజాగా వరద ప్రభావిత ప్రాంతాలపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తాజాగా గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6 జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా.. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని, సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. సీనియర్ అధికారులు, కలెక్టర్ల మీద ఈ బాధ్యత ఉందన్న సీఎం రానున్న 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల సహాయం అందాలని ఆదేశించారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌తో కూడిన రేషన్ పంపిణీ జరగాలన్నారు. రేషన్ సరుకులన్నీ బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదని, విరామం ఎరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని సీఎం అన్నారు. ఇలాంటి సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా రాష్ట్ర ప్రతిష్టను, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుని జగన్ విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదని జగన్ అన్నారు. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అలాగే వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలను పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గర్భవతులైన మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని.. వారిని ఆస్పత్రులకు తరలించాలని సూచించాడు. మరి వరద బాధితులకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.