ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి కొన్ని రోజుల క్రితం మృతి చెందని సంగతి తెలిసిందే. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో మంగళవారం సంతాప తీర్మానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తీర్మానంపై చర్చ జరిగింది. మంత్రులు, పార్టీ నాయకులు మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయేలా సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టనున్నట్లు తెలిపారు. మరో ఆరు వారాల్లో సంగం బ్యారేజీ పనులు పూర్తవుతాయని, ప్రారంభోత్సవం సందర్భంగా మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీ అని పేరు పెట్టనున్నట్లుగా సీఎం జగన్ వెల్లడించారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ భరోసా కల్పించారు.
ఇది కూడా చదవండి: గౌతమ్ రెడ్డి కుమార్తె చేసిన పనికి అంతా కన్నీరు
అంతేకాక గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన మేరకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కాలేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టి, అగ్రికల్చర్, హార్టీకల్చర్ యూనివర్శిటీగా మార్చుతామని తెలిపారు. ప్రభుత్వమే ఆ కాలేజీ బాధ్యతను తీసుకొని మంచి వ్యవసాయ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. ఉదయగిరి ప్రాంతాన్ని వెలిగొండ ఫేస్ 1 పనుల కిందికి తీసుకొచ్చి సాగునీటిని అందిస్తామని సీఎం చెప్పారు. ఉదయగిరిలోని డిగ్రీ కాలేజీలో వసతులను కూడా నాడు-నేడు పనుల్లో భాగంగా మెరుగు పరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.