పదో తరగతికే సంబరాలా..? అని మీరు అనుకోవచ్చు. ఎంత పైచదువులు చదవాలన్నా పదో తరగతి కీలకం. పాస్ కాకుంటే చదువుకు ఇక్కడే ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే ఓ విద్యార్ధి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించడం కోసం తెగ కష్టపడ్డాడు. మొత్తానికి పాసయ్యాడు. అందుకే అతని పడ్డ కష్టం నలుగురికి తెలిసేలా అతని మిత్రులు సంబరాలు చేశారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ట్రెండింగ్ లో ఉన్న మంత్రి ఎవరంటే.. అది చామకూర మల్లారెరెడ్డే. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. పైకొచ్చినా..’ అంటూ ఆయనిచ్చిన ప్రసంగాలే ఆయనకు ఇంత పాపులారిటీ తీసుకొచ్చాయి. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిన ఆయన.. తాను పడ్డ కష్టాల గురుంచి బహిరంగానే పలు మార్లు చెప్పారు. ఆయన చెప్పిన ఈ మాటలు కొందరి యువతలో స్ఫూర్తి నింపుతున్నాయి. అందుకు ఈ యువకుల సంబరాలే నిదర్శనం. స్నేహితుడు పదో తరగతి పాసయ్యాడని అతని మిత్రులు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
ఏపీలో నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో విశాఖపట్నం మధురవాడ చెందిన సాయికృష్ణ అనే విద్యార్థి గ్రేడ్ 3లో పాసైయ్యాడు. అంతే ఫ్రెండ్ పదో తరగతి పాసైన సందర్భంగా అతని మిత్రులు సంబరాలు గట్టిగానే చేశారు. సాయికృష్ణ ఎలా పాసయ్యాడో వివరిస్తూ.. ఓ ఫ్లెక్సీ ప్రింట్ చేపించి డీజే పాటలతో ఊరంతా ఊరేగించారు. కాకుంటే మంత్రి మల్లారెడ్డి డైలాగులతో ఫ్లెక్సీ ప్రింట్ వేపించారు. “పాలు అమ్మినా.. పేడ ఎత్తినా.. కుడితి మోసినా.. కష్టపడ్డా.. కనబడకపోయిన చూసిరాసినా.. మొత్తానికి పాసైన.. నీయవ్వ తగ్గదేలే..” అంటూ ఫ్లెక్సీ వేపించారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సెలెబ్రేషన్స్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.