వీధికుక్కల దాడిలో మరో వ్యక్తి ప్రాణం పోయింది. కుక్కల అటాక్లో ఓ రైతు చనిపోయాడు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు..
దేశంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ తెలంగాణలో ఈ తరహా ఘటనలు ఎక్కువవుతున్నాయి. కుక్కల అటాక్స్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ప్రమాదానికి గురవుతున్నారు. ఈ ఘటనల వల్ల కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కుక్కల మంద దాడిలో ఓ రైతు మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా, సంబేపల్లె మండలం, నారాయణ రెడ్డిగారి పల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి తన పొలం వద్ద కాపలాగా వెళ్లి పడుకున్నాడు రెడ్డెయ్య అనే రైతు. పొలంలో నిద్రిస్తున్న రెడ్డెయ్య మీద కుక్కల మంద దాడికి పాల్పడ్డాయి.
ఇవాళ ఉదయం అటువైపుగా వెళ్లిన కొందరు రైతు రెడ్డెయ్యను కుక్కలు పీక్కు తింటుండటాన్ని చూశారు. వాటిని కొట్టి తరిమేసి, దగ్గరకు వెళ్లి చూశారు. అప్పటికే రెడ్డెయ్య మృతి చెందినట్లు గుర్తించారు. రైతుపై కుక్కల దాడి గురించి తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రెడ్డెయ్య మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా.. దేశంలో ప్రతి ఏటా దాదాపు 2 కోట్ల మంది కుక్కకాటు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐపీఎంఆర్) ఓ నివేదికలో తెలిపింది. ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్కకాటు, ప్రతి అరగంటకు ఒక రేబిస్ మరణం సంభవిస్తోందని పేర్కొంది.