5జీ సేవలు అందుబాటులోకి రావడంతో.. టెలికాం రంగంలో.. పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ.. 5జీ సేవలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే.. 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 5జీ సేవలు అందించే విషయంలో ముందున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిలయన్స్ జియో.. శుభవార్త చెప్పింది. ఏపీలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమలలో జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాక 2023 నాటికి.. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు ఆ సంస్థ ప్రతినిధులు. విజయవాడలో.. సోమవారం మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్ కె.ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి 5జీ సేవల్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘నేటి కాలంలో అన్ని రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తప్పనిసరిగా మారింది. గిరిజన ప్రాంతాలకు కూడా వీలైనంత త్వరగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణకు.. ప్రభుత్వం.. అవసరమైన సహకారాన్ని అందిస్తుంది. జనవరి నుంచి తిరుపతిలో కూడా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని’’ తెలిపారు.