గత మూడేళ్ల నుంచి ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటిలాగా డబ్బులను తమ వెంట తీసుకెళ్లే వారు చాలా అరుదనే చెప్పాలి. దాదాపు ప్రతి ఒక్కరు డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. అయితే మద్యం దుకాణాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం షాపుకు వెళ్దామనుకున్న ప్రతిసారీ డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లినవారికి ఇది మరీ ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితులో మద్యం అమ్మకాల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం లావాదేవిల్లో డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఈ డిజిటల్ పేమెంట్లను శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, స్వైపింగ్, యూపీఐ పేమెంట్స్, క్యూఆర్ కోడ్ స్కాన్ తదితర డిజిటల్ చెల్లింపుల ద్వారా మద్యం కొనుగోలు చేయొచ్చు. మందుబాబుల విజ్ఞప్తితో పాటు క్యాషియర్ల చేతి వాటం, నగదు లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో డిజిటల్ పేమెంట్స్‌కు ప్రభుత్వం మొగ్గు చూపింది. పైలెట్ ప్రాజెక్టు గా తొలుత విజయవాడలో 11 మద్యం ఔట్ లెట్లల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి.. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,708 మద్యం షాపులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ఎస్బీఐ సహకారంతో ఎక్సైజ్ శాఖ అన్ని మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులు చేపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ నిర్వహణ ఉండనుంది. లిక్కర్ షాపుల్లో హార్డ్ క్యాష్‌ను తీసుకునేప్పుడు జరుగుతున్న తప్పిదాల నుంచి బయటపడేందుకు.. అమ్మకాల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువస్తుంది. డెబిట్ కార్డు, యూపీఐ లావాదేవీలకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. క్రెడిట్ కార్డు లావాదేవీలకు మాత్రం నిబంధనల ప్రకారం చార్జీలు ఉంటాయని తెలిపారు. అంటే ఇక నుంచి మద్యం ప్రియులు జేబులో క్యాష్ లేకున్న సరే కార్డులు ఉన్నా, స్మార్ట్ ఫోన్ ఉన్న మద్యాన్ని కొనుగోలు చేయవచ్చు. మరి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.