ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నారు. ఇంటింటికీ నవరత్నాల పేరిట పలు పథకాలు అమలు అయ్యేలా కృషి చేస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని పలు కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు పెంచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల ఏపీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు పలు శుభవార్తలు తెలియజేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందికి పదవీ విరమణ వయసు పెంచింది. ప్రస్తుతవ పదవీ విరమణ వయసు 60 ఉంటే.. దాన్ని 62 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయ చట్టం 1962 సంవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు వల్ల పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు మేలు జరగబోతుంది. 2022 జనవరి 1వ తేదీ నుంచి 2022 నవంబర్ 29 వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల కనీస వయసు 62 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఎప్పటి నుంచో ఏపీ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న బకాయీలను చెల్లించేందుకు కసరత్తు మొదలైంది. ఈ అంశంపై సచివాలయంలో మంత్రవర్గ ఉపసంఘాలు, సీఎస్, ఆర్థిక శాఖ అధికారులు కలిసి ఉద్యోగసంఘాలతో పలు సమస్యలపై చర్చించారు. ఈ చర్చలు సఫలీకృతమైనట్లు వార్తలు వచ్చాయి. మార్చ్ 31 లోగా ఉద్యోగుల బకాయీలు చెల్లిస్తామని జగన్ సర్కార్ హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.. ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించామని.. సుమారు రూ.3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని తెలిపారు. అలాగే రిటైర్మెంట్ గ్రాట్యూటీ, మెడికల్ ఏరియర్స్ సైతం ఈ నెలాఖరివరకు చెల్లించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.