నమ్మి ఇల్లు అద్దెకు ఇస్తే.. ఖాళీ చేయకుండా.. ఇప్పుడు ఏకంగా ఇంటి యజమానినే బయటకు గెంటేశాడు ఓ వ్యక్తి. తనకు న్యాయం చేయాలంటూ ఆ వృద్ధురాలు అధికారులను ఆశ్రయించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రుద్రంపేట గ్రామానికి చెందిన జమ్మటపాటి శాంతమ్మకు ఊరిలోని సర్వే నెంబర్ 82–3బీలోని 3 సెంట్లలో రేకుల షెడ్డు ఉంది. 2002లో సూర్యనారాయణరెడ్డి అనే వ్యక్తి కుటుంబంతో కలసి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇటీవల సూర్యనారాయణరెడ్డి తీరుపై శాంతమ్మ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని కోరారు.
అందుకు సూర్యనారాయణ రెడ్డి ‘ఈ ఇంటికీ మీకు ఎలాంటి సంబంధమూ లేదు, నా పేరు పైనే కరెంట్ మీటర్ ఉంది, ఇంటి పన్ను చెల్లిస్తున్నా, సర్వ హక్కులు నాకే ఉన్నాయి మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి.. ఖాళీ చేసే ప్రసక్తే లేద’ని తెగేసి చెప్పాడు. దీంతో శాంతమ్మ కుటుంబసభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. స్థలాల ధరలు పెరగడంతో తమకు తెలియకుండానే నకిలీ పత్రాలు సృష్టించి కరెంట్ మీటర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతరులకు సంబంధించిన డోర్ నెంబర్‌పై పన్ను కడుతున్నాడని శాంతమ్మ ఆరోపించింది. పంచాయతీ అధికారులను సంప్రదిస్తే నకిలీ డోర్ నెంబర్ పై పన్ను చెల్లిస్తున్నాడని వారు తేల్చారంది. స్థలంపై ఆశలు వదులుకోకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతోంది.