జంతువుల్లో అత్యంత విశ్వాసం కల జీవిగా కుక్క వేళ ఏళ్లుగా పేరు తెచ్చుకుంది. ఓ ముద్ద అన్నం పెడితే.. జీవితాంతం యజమాని పట్ల విశ్వాసంగా ఉంటుందని చెబుతారు. మరి అలాంటి శునకం.. ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రజలపై ఎడాపెడా దాడి చేస్తూ.. మనుషుల పాలిట పెద్ద శత్రువగా తయారయ్యింది. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది..
మనిషికి దగ్గరైన తొలి జంతువు ఏదంటే కుక్క. బహుశా మానవజాతి ప్రారంభం నుంచి.. మనిషికి, కుక్కకు మధ్య స్నేహం మొదలయ్యింది అని చెప్పవచ్చు. అది అలా కొనసాగుతూ వస్తోంది. గతంలో పల్లెటూర్లలో ఇంటి రక్షణ కోసం చాలా మంది కుక్కలను పెంచే వారు. అయితే నేటి కాలంలో.. అందుకు భిన్నమైన పరిస్థితులు వచ్చాయి. మనిషికి మంచి నమ్మదగిన నేస్తంగా మారింది కుక్క. దాంతో దాని వైభోగం పెరిగింది. చాలా మంది.. వేలు, లక్షలు పోసి మరీ కుక్కలను తెచ్చి పెంచుకుంటున్నారు. కడుపున పుట్టిన బిడ్డలతో సమానంగా వాటిని అపురూపంగా చూసుకుంటున్నారు. కొన్ని కుక్కల వైభోగం చూస్తే.. అసూయ కలుగుతుంది అంటే.. వాటి స్థాయి ఏ రేంజ్‌కు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో కుక్కలను చూస్తేనే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి.
కొన్ని రోజుల క్రితం అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ దారుణంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే. వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే వీధి కుక్కలే ఇలా దాడులు చేస్తున్నాయా అంటే కాదు. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కుక్కలు కూడా యజమానుల మీద దాడి చేసి.. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. పెంపుడు కుక్క.. యజమానిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఏకంగా 150 చోట్ల కరిచింది. అతడి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ విషాదకర సంఘటన ఆంధ్రప్రదేశ్, అనంతపూర్, గుంతకల్‌లో చోటు చేసుకుంది. నాగరాజు అనే వ్యక్తి గత నాలుగేళ్లుగా కుక్కను పెంచుకుంటున్నాడు. లక్కీ అని పేరు పెట్టి.. . కంటికి రెప్పలా కాపాడుకుంటూ కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే దాని తలపై చేయి వేసి నిమరడానికి ప్రయత్నించాడునాగరాజు. మరి దానికి ఏమనిపించిందో ఏమో తెలయదు కానీ.. అమాంతం నాగరాజు మీద దూకి దాడి చేసింది. గొంతు కొరికేందుకు ప్రయత్నించింది. దాదాపు 15 నిమిషాలపాటు దాడిచేసి దొరికినచోటల్లా కసితీరా కరిచిపారేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు నాగరాజును ఆస్పత్రికి తరలించారు.
నాగరాజు పెంచుకుంటోన్న డాగ్… రాట్ వీలర్ జాతికి చెందినది. అయితే ఇవీ చాలా డేంజర్ అంటున్నారు డాగ్ ట్రైనర్స్. వీటికి కోపమొస్తే మనుషుల ప్రాణాలకు కూడా ప్రమాదమని, అమాంతం గొంతు కొరికేస్తాయని హెచ్చరిస్తున్నారు. చాలా దేశాల్లో ఈ కుక్కలను పెంచుకోకుండా బ్యాన్ చేశాయని చెబుతున్నారు. ఇక నాగరాజు అదృష్టం బాగుండి బతికి పోయాడుగాని.. లేదంటే కుక్క చేతిలో చచ్చిపోయుండేవాడు అంటున్నారు డాగ్ ట్రైనర్స్. ఇక, పెంపుడు కుక్క చేతిలో గాయాలపాలైన నాగరాజుకి 25 ఇంజక్షన్లు చేశారు వైద్యులు. అయిత ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఇంత ప్రమాదం జరిగినా సరే ఆ కుక్కను మాత్రం వదులుకోవడానికి ఇష్టపడటం లేదు నాగరాజు. మరి ఈ దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.