శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అంటారు. ఈ భూమ్మీద జీవకోటికి ప్రాణ ప్రధాత ఈశ్వరుడు. అలాంటి శివుడికి ఎంతో ఇష్టమైన శివరాత్రి పర్వదినం నేడు. భక్తులు రకరకాల రూపాల్లో నేడు శివయ్య మీద తమ ప్రేమను చాటుకుంటుండగా.. ఓ యువకుడు సృష్టించిన అద్బుతం మాత్రం అందరిని అబ్బురపరుస్తుంది. ఆ వివరాలు..
పెన్సిల్ మొన అంటే ఎంత చిన్నగా ఉంటుంది.. అసలు అది కనపడటమే గొప్ప.. అలాంటిది దాని మీద బొమ్మలు చెక్కడం అంటే మాటలా. కానీ కొందరు అకుంటిత దీక్షతో.. ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మీద సూక్ష్మ కళారూపాలు చెక్కి అందరిని ఆశ్చర్యపరుస్తారు. తాజాగా ఓ యువకుడు శివరాత్రి పర్వదినం సందర్భంగా అద్భుతం చేశాడు. పెన్సిల్ మొన మీద శివయ్యను.. అది కూడా ధ్యాన ముద్రలో కూర్చున్న శంకరుడి ప్రతిమను ఎంతో అద్భుతంగా చెక్కాడు. పెన్సిల్ మీద ఇలాంటి అద్భుతాన్ని సృష్టించిన ఆ కుర్రాడిని ప్రశంసిస్తున్నారు జనాలు. ఆ వివరాలు..
ఈ అద్భుతం సృష్టించిన యువకుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేష్. సూక్ష్మ కళతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. చిన్నతనంలోనే ఈ కళపై ఆసక్తి పెంచుకున్న వెంకటేష్.. పెన్సిల్ ముల్లు, చిత్తుకాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, టూత్‌పిక్.. కాదేది సూక్ష్మకళకు అనర్హం అన్నట్లు.. కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. అలా వందల సంఖ్యలో కళాకృతులను రూపొందించిన వెంకటేష్.. తాజాగా మహాశివరాత్రి నేపథ్యంలో పెన్సిల్ మొనపై ఈశ్వరుడి ప్రతిరూపాన్ని చెక్కి.. అందరిని అబ్బురపరిచాడు. చార్ కోల్ పెన్సిల్ మొనపై 14 మిల్లీ మీటర్ల పొడవు, 8 మిల్లీ మీటర్ల వెడల్పుతో శివుడి రూపాన్ని చెక్కాడు వెంకటేష్. ఈ కళాఖండం పూర్తి అవ్వడానికి తనకు నాలుగు గంటల సమయం పట్టిందని.. పైగా శివుడు అంటే తనకు అపార భక్తి అని.. దాన్ని ఇలా ప్రదర్శించుకుంటున్నాను అన్నాడు వెంకటేష్.
చిన్నప్పటి నుంచి మినియేచర్ ఆర్ట్ మీద ఆసక్తితో ఇప్పటి వరకు వందల కళాఖండాలు తీర్చిదిద్దాడు వెంకటేశ్. అతడి ప్రతిభను ప్రశంసిస్తూ.. వందల అవార్డులు కూడా దక్కాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం దక్కించుకున్నాడు వెంకటేష్. కొన్ని ఏళ్ల క్రితం అనగా.. తన 19వ ఏట టూత్‌పిక్‌పై 18 మిల్లీ మీటర్ల పొడవుతో న్యూయార్క్ సిటీలో ఉన్న ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ రూపొందించి.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు వెంకటేశ్. దీనిని రూపొందించేందుకు ఆరేళ్లు పట్టింది అని తెలిపారు. ప్రస్తుతం తనకు అబ్బిన ఈ కళను మరో పది మందికి నేర్పుతున్నాడు వెంకటేష్. గ్రామాల్లో ఆసక్తి ఉన్న వారికి దీని మీద ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడు. మరి వెంకటేష్ టాలెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.