అంతా బాగుందనుకుంటున్న నేపథ్యంలో ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కారణంగా అతడి కాళ్లు, చేతులు తెగిపోయాయి. దీంతో అతడి జీవితం అంధకారంలో మిగిలిపోయింది.
ఈ మధ్యకాలంలో టెన్త్, ఇంటర్ ఫలితాల అనంతరం ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా.. విద్యార్థులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి చిన్న సమస్యకు తనువు చాలించుకోవడం పరిపాటి అయ్యింది. కానీ, ఓ యుకువుడు మాత్రం రెండు కాళ్లు, రెండు చేతులు లేకున్నా ఆత్మవిశ్వాసంతో విధిరాతకు ఎదురు నిలిచి పోరాడుతున్నాడు. ఎంతో ఇష్టపడి చదివి.. ఐఐఎమ్‌లో సీటు సంపాదించాడు. నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా పెద్దబొడేపల్లికి చెందిన చంద్రమౌళి నిరుపేద కుటుంబంలో జన్మించాడు.
చంద్రమౌళి తన స్కూల్ డేస్ లో చాలా చురుకుగా ఉండేవాడు. అన్ని గేమ్స్ ల్లో పాల్గొనేవాడు. పదవ తరగతిలో ఛాంపియన్ అవార్డు కూడా పొందాడు. తర్వాత ఇంటర్మీడియేట్ చైతన్య కాలేజీలో చదివాడు. అక్కడ కూడా చదువుపై ఆసక్తితో అన్నింట్లో ముందుండేవాడు. ఆ తర్వాత బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ అయిపోయిన తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ కు గురయ్యాడు. విద్యుదాఘాతంతో తన రెండు కాళ్లు, చేతులు కోల్పోయాడు. ఈ ప్రమాదంతో అతడి జీవితంలో పెద్ద నష్టమే వాటిల్లింది. అనుకోని ఈ సంఘటనతో చాలా మనస్తాపానికి గురైనాడు చంద్రమౌళి. అదే సమయంలో తన మిత్రులు, కుటుంబసభ్యులు అతనికి ధైర్యం చెప్పారు.
చదువుకోమని ప్రోత్సహించారు. పూర్తి సహకారం అందించారు. దీంతో చంద్రమౌళి తన లక్ష్యాన్ని మార్చుకుని ‘లా’ కోర్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆన్ లైన్ లో పాఠాలు విని పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాడు. ఎల్ఎల్ బీ పూర్తి చేశాడు. మొక్కవోని ఆత్మ విశ్వాసమే అతనిని ముందుకు నడిపింది. ఇప్పుడు దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్సిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ లో సీటు సంపాదించాడు. రెండు కాళ్లు, చేతులు లేకున్నా అలుపెరుగని దీక్షతో జీవితంతో పోరాడుతూ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మరి, యువతకు స్పూర్తిగా నిలుస్తున్న చంద్రమౌళి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.