అనకాపల్లిలో ఇటీవల జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో డివిఎన్ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థులు జై జనసేన అని నినదించారు. విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన ఎస్సై.. చేయి చేసుకోవడంతో అతడికి ఉన్నతాధికారుల నుండి అక్షితలు పడ్డాయి. అయితే..
దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు రక్షణ కాస్తుంటే.. దేశం లోపల పోలీసులు పహారా కాస్తున్నారు. కానీ దేశంలో ఆర్మీ వాళ్లకుండే గౌరవ, మర్యాదలు పోలీసులకు దక్కడం లేదు. దీనికి కారణం స్వయం కృతాపారాధమే. ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులు.. వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం, లంచం చూపిస్తే కానీ పనులు చేయకపోవడం వంటి చర్యలు వీరికి మాయని మచ్చగా మారాయి. పోలీసుల వద్దకు వెళితే న్యాయం జరగదన్న అపోహను కలిగించేలా పోలీసుల ప్రవర్తన ఉండటం కూడా ఓ కారణం. అదే రుజువు చేశారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎస్సై. దీంతో అతడిపై వేటు పడింది.
అనకాపల్లిలో ఇటీవల బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరిగాయి. అయితే ఈ వేడుకల్లో డివిఎన్ కాలేజీకి చెందిన కొంత మంది విద్యార్థులు జై జన సేన అని నినదించారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పట్టణ ఎస్సై దివాకర్ యాదవ్.. ఆ నినాదాల చేసిన విద్యార్థులను సున్నితంగా మందలించాల్సిందీ పోయి దురసుగా ప్రవర్తించారు. విద్యార్థులపై చేయి చేసుకొని, విద్యార్థులను నెట్టేసి అతి చేశారు. ఇలా చేస్తే అధికార పార్టీ నేత దగ్గర ప్రశంసలు వస్తాయని భావించిన ఎస్సై దివాకర్‌కు చుక్కెదురైంది. ఈ విషయాన్ని డివిఎన్ కళాశాల యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, కాలేజ్ కరస్పాండెంట్ రత్నాకర్ ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
జనసేన అని నినదించిన విద్యార్థులపై దివాకర్ వ్యవహరించిన తీరు పట్ల అటు ఆ పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు కూడా ఫిర్యాదు చేయడంతో దివాకర్‌ను పోలీస్ ఉన్నతాధికారులు మందలించారు. దీంతో పాటు వేటు కూడా పడింది. ఎస్సై దివాకర్‌ను వీఆర్ (వీకెండ్ రిజర్వుడ్)కి అప్పగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నఫలంగా విశాఖ వీఆర్‌కు పంపారు. కాగా 2019 బ్యాచ్‌కి చెందిన దివాకర్ యాదవ్ మొదటి నుంచి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.