మద్యానికి బానిసైన వారిలో మార్పు తెచ్చేందుకు నడుం బిగించారో జాయింట్ కలెక్టర్. మద్యం తాగడం వల్ల వచ్చే సమస్యలను చెప్పి వారితో మందు మాన్పించారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
మద్యం ఆరోగ్యానికి ఎంత హానికరమో అందరికీ తెలిసిందే. మద్యం బారిన పడి ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతుండటం చూస్తున్నాం. బాధలను మర్చిపోవడానికి తాగుతున్నామని కొందరు, రిలాక్సేషన్ కోసం తాగుతున్నామని చెబుతూ మరికొందరు తప్పించుకుంటారు. ఇలా ఏవేవో కారణాలు చెబుతూ మద్యం పుచ్చుకుంటూ ఉంటారు. మందుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకున్న వారూ ఉన్నారు. సీసాలకు సీసాలు తాగి పడేస్తూ అనారోగ్యాల బారిన పడి.. కుటుంబాలను కష్టాల్లోకి నెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని అనుకున్నారు అనకాపల్లి జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి. దీంతో అనకాపల్లి జిల్లాలోని మునగపాక మండలంలో ‘విముక్తి’ అనే పైలట్ ప్రాజెక్టును మొదలుపెట్టారు. మద్యం మాన్పించేందుకు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా మద్యం విడిచిపెట్టిన ఇద్దరు వ్యక్తులు పాటిపల్లి గ్రామంలో ఉండగా.. వారిని కలిశారు జేసీ. భూముల సర్వే కోసం మంగళవారం మండలానికి వచ్చిన కల్పన.. పాటిపల్లిలోని ఆ ఇద్దరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి.. వారి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. మద్యం మానేసిన తర్వాత వారి ఇంటి పెద్దలో వచ్చిన మార్పుల గురించి కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. వారిలో ఇప్పటికే అదే ప్రవర్తన కొనసాగుతోందా అని కనుక్కున్నారు. పిల్లల్ని పలకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ‘విముక్తి’ పైటల్ ప్రాజెక్టు సక్సెస్ కావడానికి కృషి చేసిన ఏఎన్ఎం సుజాతను జేసీ కల్పన అభినందించారు. అంత పెద్ద అధికారి అయినా ఒక పెద్ద కూతురిలా తమ దగ్గరకు వచ్చి మంచి చెడులను వాకబు చేయడంతో ఆ ఇంటి వారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. మరి.. మద్యానికి బానిసైన వారిలో మార్పు తీసుకొచ్చేందుకు జేసీ కల్పన చేస్తున్న కృషిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.