సైబర్ నేరగాళ్లు రెచ్చి పోతున్నారు. జనాలను బురిడీ కొట్టించడానికి అవకాశం ఉన్న ఏ దారిని వదలడం లేదు. ప్రభుత్వ పథకాల పేరు చెప్పి.. జనాలను మోసం చేస్తున్నారు. ఇక తాజాగా ఈ తరహా నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
సాంకేతికత పెరిగి.. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాకా.. చాలా పనులు ఇంటి నుంచే పూర్తవుతున్నాయి. షాపింగ్ మొదలు, బిల్లులు చెల్లించడం వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. కాలు కదపకుండా అన్ని ఇంటి దగ్గరకే వచ్చేస్తున్నాయి. ఇక ప్రస్తుత కాలంలో ప్రభుత్వం నుంచి అందే నగదు సాయం కూడా నేరుగా ఖాతాలోనే జమ అవుతుంది. ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా.. డైరెక్ట్‌గా ఒక్క క్లిక్‌తో అమౌంట్ మన ఖాతాలో జమ అవుతుంది. దీన్ని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టలు, మోసాలు కూడా అలానే ఉన్నాయి. ఆన్‌లైన్ పేమెంట్స్ పెరుగుతున్నట్లుగానే.. ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. అమాయకులును టార్గెట్ చేసి.. వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. మరీ దారుణం ఏంటి అంటే.. ప్రభుత్వ అధికారులమంటూ కింది స్థాయి సిబ్బందికి కాల్ చేసి సమాచారం తీసుకుని మరీ.. లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. తాజాగా ఈ తరహా సైబర్ నేరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం, ములగపూడిలో అమ్మ ఒడి డబ్బుల పేరుతో కాల్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. అమాయకుల ఖాతా ఖాళీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాతవరం మండలం ములగపూడికి చెందిన వాలంటీరు రాజేశ్వరికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. తాము అమరావతి ప్రభుత్వ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. దాంతో ఆమె కూడా నిజమని నమ్మేసింది. ఫోన్ చేసిన వ్యక్తులు అమ్మఒడి పథకం డబ్బులు రానివారి ఫోన్ నంబర్లు ఇవ్వమని అడిగారు. దాంతో రాజేశ్వరి తమ గ్రామంలో అమ్మఒడి డబ్బులు రాని భాగ్యలక్ష్మి, రవికుమార్ ఫోన్ నంబర్లను వారికి ఇచ్చింది.
దాంతో కేటుగాళ్లు.. రాజేశ్వరితో కాల్ మాట్లాడుతూనే.. ఆమె పంపిన నంబర్లకు కాల్ చేసి కాన్ఫరెన్స్ కలిపారు. అమ్మ ఒడి డబ్బులు రాకపోవడంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లుగా నమ్మించారు. కాసేపటి తర్వాత రాజేశ్వరిని ఆ కాల్ నుంచి కట్ చేశారు. ఆ తర్వాత అమ్మ ఒడి పథకం కింద డబ్బులు రాలేదని చెబుతున్న భాగ్యలక్ష్మి, రవికుమార్‌లతో మాట్లాడారు. ఫోన్ చేసిన వ్యక్తులు భాగ్యలక్ష్మి బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగారు. దాంతో పాటు ఆమె భర్త రవికుమార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భాగ్యలక్ష్మి, రవికుమార్ మొబైల్స్‌కు రెండు లింకులు పంపారు.. ఈ లింక్‌లు క్లిక్ చేయగానే భాగ్యలక్ష్మి అకౌంట్ నుంచి రూ. 9 వేలు, రవికుమార్ ఖాతా నుంచి రూ. 4 వేలు కట్ అయ్యాయి. మొత్తం రూ. 13 వేలు మాయం కావడంతో తాము మోసపోయామని గుర్తించారు భాగ్యలక్ష్మి-రవి కుమార్ దంపతులు. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెల్లి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారులమంటూ వాలంటీర్ రాజేశ్వరిని మాత్రమే కాక.. రవికుమార్ దంపతులు ఇద్దరిని మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అధికారులు లబ్ధిదారులకు కాల్స్ చేయరని.. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు.
అమ్మ ఒడి డబ్బులు అకౌంట్లో జమ చేస్తామని ఉన్న డబ్బులు కొట్టేశారు
అనకాపల్లి – అమరావతి నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, వాలంటీర్ ద్వారా లబ్ధిదారునికి ఫోన్ చేసి, అమ్మ ఒడి నగదు ఎందుకు జమ కాలేదో చెక్ చేస్తామని లింక్ ఓపెన్ చేయాలని చెప్పి రూ.13వేలు దోపిడీ చేశారు. pic.twitter.com/nxZwQC5Vem
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2023