భారత మాజీ క్రికెటర్ తిరుపతి అంబటి రాయుడు రాజకీయ ఎంట్రీకి ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. ఐపీఎల్ టోర్నీ ముగిసిన అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం.. రాయుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు ఏ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వెలువడుతున్న వేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం రాయుడు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు వార్తలొస్తున్నప్పటికీ, ఇది రాజకీయ ఎంట్రీకి సంబంధించిందే అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కొద్దిరోజుల క్రితం సీఎం జగన్ ను ప్రశంసిస్తూ రాయుడు వరుస ట్వీట్లు చేసిన సంగతి అందరికీ విదితమే. ‘రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ మీ మీద నమ్మకం.. విశ్వాసంతో ఉన్నారంటూ..’ సీఎం ప్రసంగాన్ని మెచ్చుకున్న రాయుడు ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో రాయుడు వైసీపీలో చేరబోతున్నాడంటూ గతంలోనే వార్తలొచ్చాయి. అయితే, అతడు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉండడంతో అందరూ ఆ వార్తలను కొట్టిపారేశారు. అలాంటిది బుధవారం రాత్రి మ్యాచ్ ఆడిన అతడు గురువారం ఉదయం తాడేపల్లిలో సీఎం జగన్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. రాజకీయఎంట్రీపై ప్రకటన, ఎక్కడ నుండి పోటీ చేయాలన్న దానిపై అతడు ముఖ్యమంత్రితో చర్చించినట్లు కథనాలు వస్తున్నాయి.
Great speech ..our chief minister@ysjagan garu.. everyone in the state has complete belief and trust in you sir.. https://t.co/gw4s1ek1LR
— ATR (@RayuduAmbati) April 19, 2023
మరోవైపు ఐపీఎల్ టోర్నీ ముగిసిన అనంతరం రాయుడు తన రాజకీయ ప్రయాణంపై అధికారిక ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన వెంట నడిచే కొందరు నాయకులకు ఆ దిశగా సూచనలు చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా యాక్టివ్ రోల్ తీసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే రాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా..? లేదా ప్రచారానికే పరిమితం అవుతారా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే, రాయుడికి మంచి గుర్తింపు, రాణించే సత్తా ఉన్నా.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఒక్కమాట అంటే పడని రాయుడు రాజకీయ విమర్శలకు తట్టుకోగలడా అన్నదే ప్రశ్న. దూకుడు స్వభావం కలిగిన రాయుడికి రాజకీయాలు సెట్ అవుతాయా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.