ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున కలిశారు. ఎందుకు కలిశారు అన్న దానికి ఆసక్తికర సమాధానం చెప్పాడు నాగార్జున. జగన్‌ని చూసి చాలా రోజులైందని, అందుకే విజయవాడ వచ్చినట్లు నాగార్జున తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్, నాగార్జున భేటీ అయ్యారు. ఆన్‌లైన్ టికెటింగ్ విధానానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నాగార్జునతో భేటీ ప్రాధానత సంతరించుకుంది. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: న్యూజిలాండ్ మ్యాచ్ కోసం నెట్స్ లో విరాట్ కోహ్లీ మెరుపు బ్యాటింగ్!
సమావేశం అనంతరం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నాగార్జున నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. అక్కడ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. ‘జగన్ నా శ్రేయోభిలాషి. ఆయనను చూసి చాలా రోజులవుతోంది. అందుకే విజయవాడకు వచ్చా. సీఎం జగన్‌తో కలిసి లంచ్ చేశా. విజయవాడ రావడం నాకు ఆనందంగా ఉంది’ అన్నారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు కూడా ఉన్నారు.