పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులు రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. అలా ఎందరో విద్యార్థులు పట్టుదలతో చదవి మంచి మార్కులే సాధిస్తారు. అయితే విద్యార్థులు ఎంత కష్టపడి చదివిన పరీక్షల్లో గరిష్టంగా ఎన్ని మార్కులు ఉంటాయే.. అంత మాత్రమే స్కోర్ చేయగలరు. కానీ ఇటీవల కాలంలో కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థలో అనేక తప్పులు దొర్లుతున్నాయి. విద్యార్థులకు రావాల్సిన గరిష్ట మార్కులను మించి ఎక్కువ మార్కులు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి వింత ఘటన నెల్లూరు జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో చోటుచేసుకుంది. అక్కడ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ పరీక్ష ఫలితాల్లో 800 మార్కులకు గాను రెండు వేలు, ఐదు వేల మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులు అవాక్కయ్యారు.
నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ పరిధిలో 8 నెలల క్రితం డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. తాజాగా ఆ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలను 800 గరిష్ట మార్కులకి నిర్వహించగా ఫలితాల్లో కొందరి విద్యార్ధులకు 2 వేలకు పైగా మార్కులు వచ్చాయి. ఓ విద్యార్థికి అయితే ఏకంగా 5,360 మార్కులు వచ్చాయి. దీంతో ఈ మార్కులు చూసిన విద్యార్థులు ఆశ్చర్యపోయారు. అంతేకాక అసలు ఈ వేలల్లో మార్కులు ఏంటంటూ అయోమయానికి గురవుతున్నారు. తాము ఏ గ్రేడ్ లో ఉత్తీర్ణత సాధించామో తెలియక డిగ్రీ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎనిమిది నెలల తరువాత ఫలితాలను విడుదల చేసినప్పటికీ మార్కులు తప్పు తడకగా ఉండడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. పరీక్ష ఫలితాల్లో విద్యార్థులకు వేలల్లో మార్కులు రావడంతో యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మార్కుల జాబితాలో తప్పులుంటే సవరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరీ.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.