ఎంత తిట్టినా, కొట్టినా.. తల్లే పిల్లలకు తొలి గురువు. తప్పటడుగులు వేసేటప్పుడు మురిసిపోయి..తప్పుడు అడుగులు వేస్తే సరిదిద్దుతుంది. అటువంటి తల్లిపై కుమారుడు కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పిల్లవాణ్ణి ఎందుకు వచ్చావని అడగ్గా.. అతడు చెప్పింది విని ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది
తల్లి ప్రేమను మించింది ఈ ప్రపంచంలోనే మరొకటి లేదంటారు. ఎంత తిట్టినా, కొట్టినా.. తల్లే పిల్లలకు తొలి గురువు. తప్పటడుగులు వేసేటప్పుడు మురిసిపోయి..తప్పుడు అడుగులు వేస్తే సరిదిద్దుతుంది. అటువంటి తల్లిపై కుమారుడు కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ మెట్టెక్కడం కామన్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ వెళ్లిందీ పదేళ్లు కూడా నిండని ఓ బాలుడు. అదీ కూడా ఓ విషయంలో తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన పిల్లవాణ్ణి ఎందుకు వచ్చావని అడగ్గా.. అతడు చెప్పింది విని ఆశ్చర్యపోవడం పోలీసులు వంతైంది. ఇంతకు అతడు ఎందుకు ఠాణాకు వెళాల్సి వచ్చిందంటే..?
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకులకు తన తల్లి తెల్లని చొక్కా ఇవ్వలేదన్న కారణంగా ఆ బాలుడు పోలీస్ స్టేషన్ మెట్టెక్కాడు. అదీ కూడా ఎటువంటి షర్ట్ వేసుకోకుండా.. కేవలం ఒంటిపై టవల్‌తో వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు పట్టణంలోని కొత్తపేటలో పదేళ్ల సాయి దినేష్ తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. కాగా, దినేష్ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. దినేష్ నాలుగో తరగతి పూర్తి చేశాడు. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ కావడంతో దినేష్‌తో పాటు సోదరి కూడా ఇంటివద్దే వుంటున్నారు. వీరిద్దరి ఆలనా పాలనా మారుతల్లి చూసుకుంటుంది. ఆదివారం సాయంత్రం దినేష్.. స్నేహితుడి పుట్టిన రోజు కావడంతో రెడీ అయ్యాడు. స్నానం చేసి టవల్ కట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చిన దినేష్.. తనకు తెల్ల చొక్కా ఇవ్వాలని తల్లిని అడిగాడు.
అయితే బయటకు వెళ్లడం ఇష్టంలేని తల్లి చొక్కా ఇవ్వడానికి నిరాకరించింది. అయినా మొండిగా వ్యవహరిస్తుండటంతో దినేష్‌ను కొట్టింది. దీంతో బాలుడు ఒంటికి చుట్టుకున్న టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లిపోయాడు. అర్థనగ్నంగా వెళ్లి.. తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దినేష్ నుండి తల్లిదండ్రుల వివరాలు సేకరించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు తల్లిదండ్రుల మాట విని బుద్దిగా చదువుకోవాలని బాలుడికి సూచించారు. అనంతరం దినేష్‌ను తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, మారుతల్లిపై ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలోనూ దినేష్ నూ చిత్ర హింసలకు గురి చేస్తూ, వాతలు పెట్టినట్లు ఫిర్యాదులు అందాయి. కేసు నమోదయ్యింది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది మారు తల్లి.