ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీచర్లంతా ప్రస్తుతం ఉన్న పాఠశాల నుండి వేరే చోటుకు వెళ్లి విధుల్లో చేరుతున్నారు. అందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ పాఠశాలలో తెలుగు టీచర్ బదిలీ అవగా అభిమానం పెంచుకున్న విద్యార్థినులు కన్నీటితో వీడ్కోలు పలికారు.
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. గురువు.. మనకు విలువలను నేర్పి, మన జీవితానికి మార్గం చూపే మార్గదర్శి. పిల్లల వ్యక్తిత్వాన్ని నిర్మించి ఉన్నత శిఖరాలకు బాటలు చూపే దిక్సూచి. ఒక మంచి సమాజాన్ని నిర్మించాలంటే అది ఉపాధ్యాయునికే సాధ్యం. తన జ్ఞానాన్ని మనకు పంచి సమాజంలో ఉన్నత స్థానానికి చేరేలా చేయూతనందిస్తాడు. కొంతమంది విద్యార్థులు టీచర్లపై చాలా ప్రేమను, అభిమానాన్ని పెంచుకుంటారు. తాము ఇష్టపడే టీచర్ దూరమైతే జీర్ణించుకోలేక ఏడ్చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా ఓ పాఠశాలలో తెలుగు టీచర్ ట్రాన్స్‌ఫర్ నిమిత్తం వెళుతుంటే విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శివన్న అనే వ్యక్తి ఐదేళ్లుగా తెలుగు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మడకశిరలోని బాలికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. గురువారం ఆ స్కూల్లో చివరి రోజు. కాగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి.. తెలుగు సార్‌ని సత్కరించారు. వీడ్కోలు సమావేశం అయిపోయిన తర్వాత పాఠశాల నుండి వెళ్లిపోయే సమయంలో విద్యార్థినులు ఉపాధ్యాయుని హత్తుకుని బోరున విలపించారు. ఐదు సంవత్సరాలుగా విద్యాబుద్ధులు చెప్పి, క్రమశిక్షణ మార్గంలో నడిపించిన తెలుగు ఉపాధ్యాయుని వదలలేక కన్నీరుమున్నీరయ్యారు.
పిల్లలు బాధపడుతూ సార్ మీరు ఇక్కడే ఉండండి అంటూ కన్నీరుపెట్టుకున్నారు. ఓ తండ్రిలా ఆదరించారని పిల్లలు కన్నీటితో సాగనంపారు. విద్యార్థినులను చూసి ఉపాధ్యాయుడు కూడా భావోద్వేగంతో ఏడ్చేశాడు. తన స్టూడెంట్స్‌పై ఎంత ఆప్యాయత ఉన్నా ఉద్యోగ ధర్మం తప్పదుకదా మరి! విద్యార్థినులు కన్నీటి వీడ్కోలు తెలుపుతూ తమ తెలుగు ఉపాధ్యాయునికి సెండ్‌ఆఫ్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి.