దేశంలో ఎక్కడా అన్యాయం జరిగినా ముందు మనకు గుర్తుకు వచ్చేది పోలీసులే. 365 రోజులు విధి నిర్వహణలో మునిగి తేలుతారు. ఇప్పటికీ గుండెలపై చేయి వేసి హాయిగా రాత్రి పూట నిద్రపోతున్నామంటే కారణం వాళ్లే. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తారు. ఎటువంటి పతకాలు ఆశించరు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. అటువంటి పోలీస్ శాఖ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఏపీ పోలీస్ శాఖకు అరుదైన గౌరవం దక్కింది.
ప్రజలపై విశ్వాసం, సమర్థత, నిజాయితీతో దేశంలోనే ఏపీకి తొలి స్థానం దక్కింది. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల డీజీపిలతో కేంద్రం సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో తొలి ఐదు రాష్ట్రాల్లో ఏపీ పోలీస్ శాఖ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని ఏపీ పోలీస్ శాఖ వెల్లడించింది. ఇది ఏపీ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు గర్వకారణమని తెలిపింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో ఏపీ తర్వాత తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీలున్నాయి. సమర్థత, నిజాయితీ విభాగాల్లో రెండింటిలోనూ ఏపీ తొలి స్థానంలో నిలిచింది.
సమర్థత విభాగంలో ఏపీ తర్వాత తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ నిలువగా, నిజాయితీ విభాగంలో ఏపీ తర్వాత ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీలున్నాయి. గత ఏడాది తీసుకున్న చర్యలకు గానూ ఈ ఫలితాలు లభించాయని ఏపీ పోలీస్ శాఖ స్పష్టం చేసింది. 1.7 కోట్ల దిశ యాప్ రిజిస్ట్రేషన్లు, నేర నిరూపణతో శిక్ష పడేవిధంగా దర్యాప్తు, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్, సాంకేతిక సాంకేతికత వినియోగం ద్వారా త్వరితగతిన పోలీస్ ప్రతి స్పందన, పోలీసుల్లో క్రమశిక్షణా విధానాన్ని పెంపొందించడం ద్వారా ఏపికి ప్రశంసలు దక్కాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏపికి ప్రథమ స్థానం లభించడంపై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు.
#APPolice stands first in the country in the aspects of Public trust,efficiency&honesty:A conference was held with DGPs of the States with Hon’ble @PMOIndia & @HMOIndia from Jan 20 to 22 in #NewDelhi.(1/4) pic.twitter.com/9yYB6JxpjC
— Andhra Pradesh Police (@APPOLICE100) January 27, 2023