పెళ్లికి కీలకమైన అంశం షాపింగ్. దుస్తులు, నగలు, ఇతర పెళ్లి సామాన్ల కోసం గంటలు గంటలు షాపుల్లో గడిపేస్తుంటారు. ఒకరికి నచ్చినదీ మరొకరికి నచ్చదు. అందరికీ నచ్చే సరికి సమయం మించి పోతుంది
పెళ్లి అనగానే సందడి కామన్. పెళ్లి చూపుల దగ్గర నుండి వివాహ తంతు ముగిసే వరకు .. ప్రతి అంశం హడావుడిగా జరిగిపోతుంటూంది. అయితే ఇందులో కీలకమైన అంశం షాపింగ్. దుస్తులు, నగలు, ఇతర పెళ్లి సామాన్ల కోసం గంటలు గంటలు షాపుల్లో గడిపేస్తుంటారు. ఒకరికి నచ్చినదీ మరొకరికి నచ్చదు. అందరికీ నచ్చే సరికి సమయం మించి పోతుంది. అయితే ఈ సమయంలోనే కేటుగాళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. షాపింగ్ మోజులో పడిపోయి కాస్త పరధ్యానంగా ఉంటే చాలు తెచ్చుకున్న డబ్బులను లూటీ చేసేస్తారు కస్టమర్ల రూపంలో ఉన్న దొంగలు. అలా చాలా వస్తువులు,డబ్బులు పోయిన అనుభవాలు ఉన్నాయి. తాజాగా ఓ పెళ్లి బృందానికి షాక్ నిచ్చాడు ఓ బాలుడు.
వయస్సు నిండా 15 ఏళ్లు కూడా లేవు. కానీ పెళ్లి బృందం నుండి లక్ష కాజేశాడో బాలుడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. గుణచింతల పల్లి అబ్బాయికి, గట్టు రాయపాకలకు చెందిన అమ్మాయికి వివాహం నిశ్చయమైంది. వీరంతా కలిసి పెళ్లి దుస్తులు తీసేందుకు షాప్‌కు వెళ్లారు. వీరంతా పెళ్లి దుస్తులపై దృష్టి పెడుతుంటే..13 ఏళ్ల బాలుడు మాత్రం వారు తీసుకు వచ్చిన డబ్బులపై కన్నేశాడు. డబ్బులు ఉన్న వ్యక్తి దగ్గర అరగంట పాటు రెక్కీ నిర్వహించి.. డబ్బులు కొట్టేశాడు. దుస్తులు తీసుకున్నాక డబ్బుల కోసం వెతకగా..అవి కనిపించలేదు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. అందులో బాలుడు డబ్బులు తీసుకెళుతున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు.