Professor Shanthamma: ఎవరీ ప్రొఫెసర్ శాంతమ్మ? 94 ఏళ్ళ వయసులో రానూ, పోనూ 130 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ ఏజ్‌లో ఎవరైనా సరే పట్టు కోల్పోయి మంచాన పడతారు. కానీ ఈ అమ్మ మాత్రం ఓపిక తెచ్చుకుని మరీ రోజూ 4 నుండి 5 గంటలు ప్రయాణం చేస్తూ.. విద్యార్థులకి పాఠాలు చెబుతున్నారు. ప్రయాణంలో అలసిపోవడం, పాఠాలు సరిగా చెప్పకపోవడం లాంటి పదాలకు ఆమె డిక్షనరీలో చోటు లేదు. ఎందుకంటే ఆమె దగ్గర పాఠాలు నేర్చుకున్న విద్యార్థులంతా గొప్ప స్థాయిలో ఉన్నవారే. ఆమె పర్యవేక్షణలో 12 మంది పీహెచ్‌డీ పూర్తిచేశారు. అట్లుంటది చదువుల తల్లి సరస్వతమ్మతోని.
విజయనగరంలోని సెంచురియన్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 1989లోనే శాంతమ్మ ప్రొఫెసర్‌గా రిటైర్ అయ్యారు. కానీ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే జ్ఞానం వృధా అవుతుందని అభిప్రాయపడ్డారు. తన దగ్గరున్న జ్ఞానాన్ని విద్యార్థులకు పంచాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మళ్ళీ ఆమె కాలేజ్ బాట పట్టారు, పుస్తకాలు చేతబట్టారు. రెండు మోకాళ్ళకు ఆపరేషన్ జరిగింది. అయినా గానీ చేతి కర్రల సాయంతో ఆమె క్రమం తప్పకుండా క్లాసులకు వెళ్తారు. కాలం, శక్తి ఈ రెండూ చాలా ముఖ్యమని, వృధా చేయకూడదని ఆమె అంటారు.
నాలుగు గంటలకు లేచి.. 8, ఎనిమిదిన్నర ప్రాంతంలో వైజాగ్ నుండి ప్రయాణం మొదలుపెడతారు. 11 గంటలకి విజయనగరంలో ఉన్న యూనివర్సిటీకి చేరుకుంటారు. ఎంతో ఉత్సాహంతో ఆమె రోజూ ఆరు క్లాసులు చెబుతారు. మళ్ళీ 4 గంటలకి తిరుగు ప్రయాణం కడతారు. అసలు ఈ వయసులో ప్రయాణం చేయడమే కష్టం. అలాంటిది పని కూడా చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్ శాంతమ్మేనని, గిన్నిస్‌బుక్ వాళ్లకు ఆమె పేరును సూచిస్తానని ఆమె శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారట. ఇంకా మరెన్నో విషయాలను పంచుకున్నారు. ఆ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.