టెన్త్ పరీక్షల్లో ఆరవ తరగతి విద్యార్థిని సత్తా చాటింది. వయసుకు మించిన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ బాలిక రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది.
‘‘పిట్ట కొంచెం కూత ఘనం’’ అన్న సామెత వినే ఉంటారు. తమ సైజును మించి అద్బుతమైన ప్రతిభ కనబరిచే వారిని పొగడ్డానికి ఈ సామెత వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బాలికకు కూడా ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. చిన్న వయసులోనే ఆ బాలిక అసమాన్య ప్రతిభను కనబరిచింది. ఆరవ తరగతి చదువుతున్న ఆ బాలిక టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులతో పాసైంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా గాంధీనగర్‌కు చెందిన ముప్పల సురేష్, మణి దంపతులకు హేమశ్రీ అనే కూతురు ఉంది. హేమశ్రీ మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. హేమశ్రీ వయసుకు మించిన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించింది.
చదువులో ఎంతో చురుగ్గా ఉండసాగింది. ముఖ్యంగా మెమోరీ పవర్ విషయంలో హేమశ్రీకి ఆ స్కూల్లో పోటీ లేకుండా పోయింది. ఈ బాలిక ప్రతిభ ఆనోటా ఈ నోటా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మార్చి 27న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ బాలిక తెలివితేటల్ని పరీక్షించారు. ఆమె ప్రతిభకు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అంతేకాదు! హేమశ్రీని టెన్త్ పరీక్షలు రాయటానికి అనుమతి ఇచ్చారు. గత మే నెలలో హేమశ్రీ టెన్త్ విద్యార్థులతో పాటు టెన్త్ పరీక్షలు రాసింది. శనివారం టెన్త్ పరీక్షల ఫలితాలు రాగా.. అందులో ఆమెకు 488 మార్కులు వచ్చాయి. దీంతో హేమశ్రీ సాధించిన విజయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
కాగా, ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎప్పటి లాగే బాలికలే పైచెయ్యి సాధించారు. బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 2,22,976 మంది పరీక్షల్లో పాసయ్యారు. బాలురు 69.27 శాతం ఉత్తీర్ణతను సాధించారు. 2,14,220 మంది బాలురు పరీక్షల్లో పాసయ్యారు. ఇక, పది పరీక్ష ఫలితాల్లో 87.47 శాతం ఉత్తీర్ణత సాధించి పార్వతీపురం మన్యం మొదటిస్థానంలో ఉండగా.. 60.39 శాతంతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది. మరి, పదవ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన హేమశ్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.