ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో నాలాలో పడి పదేళ్ల బాలిక మరణించిన ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. డ్రైన్‌లో ఆరేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.
తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాగులు, చెరువులు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఇక నగరాల పరిస్థితి చెప్పక్కర్లేదు. వర్షం పడ్డ నాలుగైదు గంటల వరకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో నాలాలో పడి పదేళ్ల బాలిక మరణించిన సంగతి అందరికీ విదితమే. ఈ ఘటన మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడు డ్రైన్‌లో కొట్టుకుపోయాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
గురువారం రాత్రి విజయవాడ పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడ చూసిన వరద నీరు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో గురునానక్ కాలనీకి చెందిన ఆరేళ్ళ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ డ్రైన్‌లో పడిపోయాడు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బాలుడు ఆ నీటిలోనే కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.