ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయాలన్న వారి ఆలోచన విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి వెలువడ్డ పొగను పీల్చిన 40 మంది విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అప్రమత్తమవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.
కొందరు వ్యక్తులు చేసిన ఆకతాయి పని వల్ల 40 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి వెలువడ్డ పొగను పీల్చిన విద్యార్థులు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అప్రమత్తమై విద్యార్థులను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంకలోని విజ్ డమ్ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. ఆ వివరాలు..
సోమవారం మధ్యాహం సమయంలో కొందరు వ్యక్తులు స్కూల్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో వెలువడిన దట్టమైన పొగ పాఠశాల భవనాన్ని కమ్మేసింది. దీనిని పీల్చిన 40 మంది విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను బండారులంకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు వెంటనే స్పందించడంతో 29 మంది విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడింది. మిగిలిన 11 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దట్టంగా వచ్చిన పొగ వల్ల ఊపిరాడకే అస్వస్థత కలిగిందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురుంచి ఆరా తీశారు. చికిత్స పొందతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే, ప్లాస్టిక్ వ్యర్థాలను దగ్ధం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.