నంద్యాల జిల్లా ఆత్మకూర్ లో నాలుగు పులి పిల్ల కూనలను గ్రామస్థులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కూనలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక తల్లి జాడ కోసం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జల్లెడ పట్టినా కనిపించలేదు.
ఇటీవల నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం.. పెద్ద గుమ్మాడపూరం సమీపంలో నాలుగు పులి పిల్లలు ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. వాటిపై కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని నాలుగు పులి కూనలను ఓ గదిలో ఉంచి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ పులి కూనలు సమీప నల్లమల అటవీ ప్రాంతం నుంచి తప్పి గ్రామంలోకి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు భావించారు. వెంటనే ఆ పులి కూనలను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఇందుకోసం 40 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.. తల్లి జాడ కనిపెట్టలేకపోయారు అధికారులు. మరోవైపు పులి కూనల పరిస్థితి దయనీయంగా మారుతుండటంతో ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్ద గుమ్మాడపూరం సమీపంలో ఓ గడ్డివాము దగ్గర నాలులు పులి పిల్లలు గ్రామస్థులకు కనిపించాయి. పులి తన పిల్లలతో గ్రామం వైపు వచ్చి పిల్లలను ఇక్కడే వదిలి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు భావించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి పిల్లలను ఫారెస్ట్ అధికారులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇక తల్లి పులి వస్తుందేమో అని ఎదురు చూశారు.. రెండు రోజులైనా దాని జాడలేదు. ఈ క్రమంలోనే అధికారులు తల్లి పులి కోసం అడవి అంతా జల్లెడపట్టారు. కానీ పులి కూనల కోసం తల్లి పులి రాలేదు.. మరోవైపు తల్లిపాలు లేక పులి కూనలు బక్కచిక్కిపోతున్నాయి. ఈ క్రమంలో ఆపరేషన్ మదర్ టైగర్ కి గురువారం అధికారులు ముగింపు పలికారు. నాలుగు ఆడ పులి పిల్లలను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ కి తరలించారు.
నాలుగు ఆడ పులి పిల్లల వయసు 50 రోజులు అని.. ప్రస్తుతం వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో వాటి ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు. తల్లి పాలు లేక నాలుగు కూనలు చాలా బలహీనంగా ఉన్నాయని.. వెంటనే వాటికి బలవర్ధకరమైన ఆహారాన్ని అందజేస్తామని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఎండాకాలం కనుక చిన్న కూనలు వేడి తట్టుకోలేవని.. అందుకే వాటిని ఏసీలలో సంరక్షిస్తామని అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా నాలుగు పులి పిల్లల పరిస్థితి అందరి హృదయాలను కదలించి వేశాయి.. బిడ్డల్ని కనివేసి అనాథలుగా వదిలేసే జాఢ్యం మనుషులకే అనుకున్నాం.. ఇప్పుడు జంతువులకు కూడా వచ్చిందా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.