పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ-బి సమీపంలో విషాదం చోటు చేసుకుంది. నాలుగు ఏనుగు ప్రమాదానికి గురై చనిపోయాయి. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని...
ఈ మధ్య కాలంలో ఏనుగులు జనావాసాల్లోకి రావటం ఎక్కువయిపోయింది. గుంపులు, గుంపులుగా ఊర్లలోకి వచ్చి ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో తరచుగా ఏనుగులు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఏనుగుల భీభత్సంలో ఇది వరకు చాలా మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ, తాజా సంఘటనలో పార్వతీపురం మన్యంలో నాలుగు ఏనుగులు సంచరిస్తూ ప్రమాదానికి గురయ్యాయి. విద్యుదాఘాతం కారణంగా ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడ-బి సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
పంట పొలాల వద్ద నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌కు తాకి నాలుగు ఏనుగులు చనిపోయాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన ఏనుగులలో ఒక మగ ఏనుగు, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆరు ఏనుగులు మన్యంలోకి వచ్చినట్లు వెల్లడించారు. నాలుగు చనిపోగా.. రెండు అక్కడినుంచి ప్రాణాలతో బయటపడి వెళ్లిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మిగతా రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎంత భీభత్సం చేస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు కొండవైపు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.