ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి దగ్గర భారీగా వజ్రాలు వెలుగు చూశాయి. వాటి విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు తేల్చారు. ఇక, వజ్రాలను సంబంధిత వ్యక్తులకు తిరిగిచ్చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మేదరమెట్ల హైవేపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన బొబ్బ పవన్ కుమార్ గుంటూరులోని కిషన్ జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. గతంలో అతడు కిషన్ జ్యువెలరీ మార్కెటింగ్ సేల్స్ మ్యాన్‌గా తిరుపతిలో పని చేసేవాడు. మూడు నెలల క్రితం గుంటూరుకు షిఫ్ట్ అయ్యాడు. ఆదివారం షాపు పని మీద గుంటూరు నుంచి ఒంగోలుకు బయలు దేరి వెళ్లాడు.
ఒంగోలులో పని అయిపోగానే రాత్రి మళ్లీ గుంటూరుకు ప్రయాణం అయ్యాడు. రాత్రి 10 గంటల సమయంలో కనిగిరి నుంచి విజయవాడ వెళుతున్న బస్సు ఎక్కాడు. రాత్రి 11 గంటల సమయంలో అతడి ఛాతిలో నొప్పి మొదలైంది. ఇది గమనించిన పక్క సీటు వ్యక్తి డ్రైవర్‌కు సమాచారం ఇచ్చాడు. డ్రెవర్ వెంటనే బస్సు ఆపాడు. ఆ వెను వెంటనే 108కు సమాచారం అందింది. కొద్ది సేపటి తర్వాత అంబులెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చారు. అతడ్ని పరిశీలించి చూశారు. అప్పటికే పవన్ మృతి చెందినట్లు తెలిపారు. డ్రైవర్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.
పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టారు. అతడి గురించి వివరాలు అందాయి. షాపు వారికి, కుటుంసభ్యులకు సమాచారం అందింది. మరింత సమాచారం కోసం అన్వేషిస్తున్న పోలీసులకు అతడి ఓ బ్యాగు కనిపించింది. దాన్ని తెరిచి చూడగా.. కోటి రూపాయల విలువైన 47 వజ్రాలు, బంగారు దండలు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక, వజ్రాలు, బంగారు అభరణాలను పత్రాలు చూపిన షాపు వారికి తిరిగిచ్చేశారు.