దోపిడీ దొంగల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారు. స్టేషన్ లో ఉన్న రికవరీ సొత్తు అయిన 105 కేజీల వెండి ఆభరణాలు, రూ. 2.05 లక్షల విలువైన నగదు మాయం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దోపిడీ దొంగల నుంచి రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారు. స్టేషన్ లో ఉన్న రికవరీ సొత్తు అయిన 105 కేజీల వెండి ఆభరణాలు, రూ. 2.05 లక్షల విలువైన నగదు మాయం అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. గతంలో 2021 జనవరి 28 రాత్రి కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో తమిళనాడు కు చెందిన శాతన భారతి, మణికందన్ అనే ఇద్దరు వ్యాపారుల దగ్గర 105 కిలోల వెండి, రూ. 2.05 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వాటికి సరైన ఆధారాలు లేకపోవడంతో.. వాటిని సీజ్ చేసి అప్పటి కర్నూలు తాలుకా అర్బన్ సీఐ విక్రమ్ సింహాకు అప్పగించారు. దాంతో కథ ముగిసింది అని అందరు అనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మెుదలైంది.
ఈక్రమంలోనే సీజ్ చేసిన ఆ 105 కేజీల వెండిని, రూ. 2 లక్షల రూపాయల డబ్బులను పోలీసు స్టేషన్ బీరువాలో ఉంచారు. ఈ సొత్తుకు కాపలాగా ఓ మహిళా కానిస్టేబుల్ ను నియమించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు ఆ స్టేషన్ కు సంబంధించి ముగ్గురు సీఐలు మారారు. చివరగా 2022 నవంబరులో సీఐ శేషయ్య బదిలీ అయ్యి సీఐ రామలింగయ్య వచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ వెండి ఆభరణాలకు సంబంధించిన వ్యాపారులు స్టేషన్ కు రాలేదు. తాజాగా మార్చి 27వ తేదీనా వెండి ఆభరణాలకు సంబంధించిన యజమానులు శాతన భారతి, మణికందన్ స్టేషన్ కు వచ్చారు.
కాగా వారు వస్తూ.. వస్తూ.. కోర్టు నుంచి ఆ సొత్తు తమదే అన్న అనుమతి పత్రాలు తీసుకుని వచ్చి, తమ సొత్తు తమకు అప్పగించమని అడిగారు. దాంతో సీఐ రామలింగయ్య బీరువా తెరిచి చూడగా.. షాక్ తిన్నాడు. అందులో వెండిగానీ, డబ్బులు గానీ లేవు. దాంతో ఈ వార్త సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ వెండి విలువ అక్షరాల 75 లక్షలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది ఇంటి దొంగల పనే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మరో పెద్ద సమస్య ఏంటంటే.. ముగ్గురు సీఐలు బదిలీ కావడం, నాలుగో సీఐ విధుల్లో ఉండటంతో.. ఏ అధికారి కాలంలో ఈ దొంగతనం జరిగింది అన్నది మిస్టరీగా మారింది. గతంలో ఇదే స్టేషన్ లో మద్యం సీసాలు దొంగలించిన హెడ్ కానిస్టేబుల్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సమాచారం. మరి పోలీసు స్టేషన్ లోనే దొంగతం చేసిన వారిని ఏ విధంగా పట్టుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. మరి తాజాగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.