పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీపై క్లారిటీ ఇచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్

anurag-thakur

టీ-20 ప్రపంచ కప్ 2021 ముగిసింది. ఈ మెగాటోర్నీ ముగిసిన రెండు రోజులకే ఐసీసీ (ICC) వచ్చే దశాబ్ద కాలానికి ప్రధాన టోర్నీల షెడ్యూల్ విడుదల చేసింది.ఈ మెగాటోర్నీలకు వివిధ దేశాలని ఎంపిక చేసింది. ఇక, భారత్ కు అత్యధికంగా మూడు సార్లు ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం వచ్చింది. వచ్చే పదేళ్లలో 8 ఐసీసీ టోర్నమెంట్ల వేదికల్ని ప్రకటించింది. 2024 టీ20 వరల్డ్ కప్ను వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఒక ఐసీసీ మెగా ఈవెంట్ ని అమెరికా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

అయితే ఐసీసీ ప్రకటించిన ఈవెంట్ వేదికల్లో పాకిస్థాన్ కూడా ఓ టోర్నీ నిర్వహిస్తుంది. నాలుగేళ్ల క్రితమే ఆపేసిన చాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ తిరిగి పునరుద్దరించింది. దానిలో భాగంగా 2025లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కి పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. పాకిస్థాన్ లో 1996లో వరల్డ్ కప్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు అక్కడ మరో ఐసీసీ టోర్నీ జరగలేదు. 29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరగనున్న ఐసీసీ టోర్నీ ఇదే. ప్రధానంగా ఉగ్రవాదం కారణంగా విదేశీ జట్లు పాక్ లో పర్యటించేందుకు భయపడుతుండడమే అందుకు కారణం. 2009లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ లో పర్యటించినప్పుడు లాహోర్ లో పర్యటక జట్టు బస్సుపై దాడి జరిగింది. అప్పటి నుంచి వేరే దేశాలు అక్కడ పర్యటించడానికి భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్ లో భారత్ ఆడుతుందా?

షెడ్యూల్ ప్రకారం 2020లో జరగాల్సిన ఆసియా కప్కు కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నది. అయితే కరోనా కారణంతో పాటు ఇండియా ఆ దేశంలో పర్యటించడానికి విముఖత చూపించింది. రాజకీయ కారణాల వల్ల పాకిస్థాన్ రాలేమని చెప్పింది. దీంతో వచ్చే ఏడాది శ్రీలంక వేదికగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆతిథ్యంలో ఆసియా కప్ నిర్వహించడానికి కసరత్తు చేస్తుంది. 2025లో పాకిస్థాన్ లో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ లో భారత్ ఆడటం అనే దానిపై స్పష్టత రాలేదు.

అయితే ఈ విషయంపై తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్తాన్లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా పాల్గొంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయ కారణాల వల్ల భారత జట్టు ఆ దేశంతో ఆడటం లేదు. 2025లో చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కేంద్ర హోం శాఖదే తుది నిర్ణయం. ఈ విషయంలో బీసీసీఐ, క్రీడా శాఖ చేసేది ఏమీ లేదు అని మంత్రి ఠాకూర్ అన్నారు. మరోవైపు కేవలం టీమ్ ఇండియానే కాదు ఇతర దేశాలు కూడా పాకిస్థాన్ లో పర్యటించడానికి సిద్దంగా లేవు. ఇటీవలే పాకిస్థాన్ తో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తమ పర్యటనలను రద్దు చేసుకున్నాయి.