కేప్ టౌన్ లో విజయం మాదే ప్రొటిస్‌ కెప్టెన్‌

Cape Town 3rd Test

‘మూడు టెస్టులు, మూడు వన్డేలు సిరీస్ కోసం భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇరుజట్లు 1-1 తో గెలిచి సమంగా ఉన్నాయి. అయితే కేప్ టౌన్ లో జరగనున్న మూడో టెస్టు విజయంపై అటు సౌతాఫ్రికా, ఇటు టీమిండియా ఎంతో ధీమాగా ఉన్నాయి. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తుంటే, స్వదేశంలో భారత్‌పై తమకున్న రికార్డును పదిలంగానే ఉంచాలని ప్రొటిస్‌ జట్టు పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఇప్పటికే 1-1 తో సమంగా ఉన్నఈ సిరీస్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానున్న చివరి టెస్టు మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. నిజానికి కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానాన్ని పేసర్లకు ప్యారడైజ్ అని పిలుస్తారు. ఇక వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైనా టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మూడో టెస్టుకు అందుబాటులోకి రావడం ఖాయంగానే కనిపిస్తుంది. జోహెన్నెస్ బర్గ్ విజయంతో సిరీస్ ని సమం చేసిన దక్షిణాఫ్రికా సారథి డీన్‌ ఎల్గర్‌ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ క్రమంలో మూడో టెస్టుకు ముందు ఎల్గర్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘‘మూడో టెస్టు మాకు చాలా ముఖ్యమైనది. జోహెన్నెస్ బర్గ్ లో ఆడినట్లుగానే.. కేప్‌టౌన్‌లోనూ ఆడినట్లయితే కచ్చితంగా విజయం మాదే అంటూ టీమిండియాకు హెచ్చరికలు పంపాడు.