ధోనీని కలిసేందుకు ఆ క్రేజీ అభిమాని చేసిన పనికి ఆశ్చర్యపోతారు..

dhoni fan

సెలబ్రిటీలను కలిసేందుకు అభిమానులు చేసే ప్రయత్నాలు, వారి గేటు పడిగాపులు కాయడం కొత్తేం కాదు. మెగాస్టార్‌ కోసం చిత్తూరు నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చిన అభిమాని, సోనూసూద్‌ను కలిసేందుకు హైదరాబాద్‌ నుంచి 700 కిలోమీటర్లు నడిచి ముంబయి వెళ్లిన అభిమాని గురించి అందరికీ తెలుసు. కానీ, కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ కోసం ఓ అభిమాని చేసిన పని చూస్తే షాకవుతారు. అతను ఏకంగా 1436 కిలోమీటర్లు నడిచి ధోనీని కలిశాడు. ఇది ఫస్ట్‌ టైమ్‌ కాదు. గతంలోనూ ఒకసారి అలా వచ్చి ధోనీని కలవలేక వెనుదిరిగాడు. మళ్లీ 1436 కిలోమీటర్లు నడిచి వచ్చి ధోనీని కలిశాడు ఆ క్రేజీ అభిమాని. మరి అతను ఎవరు ఏంటో తెలుసుకుందాం..

క్రేజీ అభిమాని..

ధోనీని కలిసిన ఆ క్రేజీ అభిమాని పేరు అజయ్‌ గిల్‌. అతని స్వస్థలం హర్యాణాలోని జలాన్‌ ఖేడా. ధోనీని కలవాలి అనే కోరికతో అతను ఏకంగా 1,436 కిలోమీటర్లు నడిచి రాంచీకి చేరుకున్నాడు. అతని ఇంటి నుంచి రాంచీలోని ధోనీ ఫామ్‌ హౌస్‌కు చేరుకునేందుకు అతనికి 18 రోజులు పట్టింది. ఆ విషయం తెలుసుకున్న ధోనీ అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. తన అభిమానిని గట్టిగా హత్తుకుని ఫామ్‌ హౌస్‌లోకి తీసుకెళ్లాడు. అతనికి భోజనం ఏర్పాట్లు చేయడం.. అతనికి ఆటోగ్రాఫ్‌ ఇవ్వడం.. అతను తిరిగి ఇంటికెళ్లేందుకు విమానం టికెట్లు బుక్‌ చేయడం అన్నీ జరిగిపోతున్నాయి. అదంతా చూస్తున్న అజయ్‌ గిల్‌కు అంతా కలగా ఉంది. ధోనీ ఆటోగ్రాఫ్‌ కోసం వచ్చిన అతనికి దొరికిన సత్కారం చూసి ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు.

ఇదే ఫస్ట్‌ టైమ్‌ కాదు..

అజయ్‌ గిల్‌ కు క్రికెట్‌ అంటే చాలా ఇంష్టం. ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన సమయంలో బాగా కుంగిపోయాడు. క్రికెట్‌ ఆడటం మానేశాడు. తన అభిమాన క్రికెటర్‌ ధోనీ ఆశీర్వాదం తీసుకున్నాకనే క్రికెట్‌ ఆడతా అంటూ శపథం చేశాడు. ధోనీ క్రికెట్కు వీడ్కోలు పలికి ఏడాది కావొస్తున్న సమయంలో కలిసేందుకు 16 రోజులు నడచుకుంటూ  వచ్చాడు. అప్పుడు ధోనీ ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌ కోసం యూఏఈలో ఉన్నాడని కలవడం కుదరదని సెక్యూరిటీ చెప్పాడు. మళ్లీ ఇప్పుడు హర్యాణా నుంచి 18 రోజులు పాటు నడిచి ధోనీని కలిశాడు. చివరకు ధోనీ ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. ‘ధోనీ నాకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పాడు.. ఐ లవ్‌ యూ అజయ్ అన్నాడు’ అని చెప్తూ అజయ్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఇక నుంచి తాను క్రికెట్‌ ఆడతానని అజయ్‌ గిల్‌ తెలిపాడు. ధోనీ అభిమాని చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.