అంతర్జాతీయ బాడీ బిల్డర్ జగదీశ్ కరోనాతో మృతి

గుజరాత్ (నేషనల్ డెస్క్)- కరోనాకు తన, మన బేదం లేదు. పేదలు, ధనవంతులన్న వ్యాత్యాసం చూపదు. అంతే కాదు కరోనాకు బలహీనులు, బలవంతులన్న తేడాలు అస్సలు లేవు. బలహీనమైనవాళ్లనే కాదు అత్యంత బలమైన వారిని కూడా కరోనా మహమ్మారి పట్టి పీడించి కబలించేస్తోంది. ఉక్కులాంటి కండలు తిరిగిన శరీరం కలిగిన మిస్టర్ ఇండియా మెడలిస్ట్ జగదీశ్ లాడ్ కు కరోనా సోకింది. కొన్ని రోజులు ఆయన కరోనాతో పోరాడి చివరకు మృతి చెందారు. 34 ఏళ్ల జగదీశ్ గుజరాత్ లోని వడోదరలో తుదిశ్వాస విడిచారు. అంతర్జాతీయ బాడీ బిల్డర్ అయిన జగదీశ్ గత నాలుగు రోజులుగా వడోదరలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స పొందారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీల్లో ఆయన తన స్వరాష్ట్రం మహారాష్ట్రతో పాటు, ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు.

మిస్టర్ ఇండియా పోటీల్లో ఆయన కాంస్య పతకాన్ని గెలుచుకుని శబాష్ అనిపించుకున్నారు. ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించారు. తన కెరీర్ లో ఎన్నో విజయాల చూసిన జగదీశ్ కరోనా ముందు మాత్రం ఓడిపోయారు. ఆయన మరణం పట్ల బాడీ బిల్డర్లందరూ సంతాపం ప్రకటించారు. జగదీశ్ కు భార్య, ఒక కూతురు ఉన్నారు.