ఉస్తాద్ హోటల్, బెంగళూరు డేస్ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆడియన్స్ ఉన్నారు. ఆ సినిమాలు చూసిన వారికి డైరెక్టర్ అంజలి మేనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంజలి మేనన్ సినిమా అంటే ప్రేక్షకులకు మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అయితే ఆమె కూడా ఎప్పుడూ ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని తగ్గించరు. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని నిరూపించారు. తాజాగా అంజలి మేనన్ రచించి, దర్శకత్వం వహించిన “వండర్ ఉమెన్” సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోని లివ్ లో విడుదలైంది. ఆ సినిమా కథ ఏంటి? ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నందిత(నదియా) సుమన పేరుతో గర్భిణీలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి వ్యాయామం చేయాలి? వంటి అంశాలను నేర్పుతూ ఉంటుంది. ఆమె దగ్గర నేర్చుకునేందుకు ఒక కొత్త బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ లో నోరా(నిత్య మేనన్), వేణి(పద్మప్రియ), మినీ(అర్చనా దేవి), సాయ(సయనోరా ఫిలిప్), గ్రేసీ(అర్చనా పద్మిని), జయ(అమృతా సుభాష్) ఉంటారు. ఒక్కొక్కరికీ ఒక కథ ఉంటుంది. ఒక విభిన్నమైన కుటుంబ నేపథ్యం ఉంటుంది. వాళ్లు అంతా అక్కడ ఎలా కలిసిపోయారు? వారి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? వారి ప్రయాణం ఎలా సాగింది? అనేదే కథ.
నిజానికి వండర్ ఉమెన్ అనేది ఒక కథ కాదు.. అది నిజ జీవితం. అందరూ రోజూ చూస్తూనే ఉంటారు. మీ ఇంట్లోనే, మీ ఎదురింట్లోనే, మీ బంధుమిత్రుల్లోనూ.. ఎక్కడో ఒకచోట అలాంటి కథలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఈ సినిమా చూసినంతసేపు మీకు ప్రతి సన్నివేశం ఎక్కడో ఒకచోట కనెక్ట్ అవుతూనే ఉంటుంది. వారి కథలు మీకు ఎవరో ఒకరిని గుర్తు చేస్తూనే ఉంటాయి. ఒక స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం జరిగే వరకు అసలు ఏం జరుగుతుంది? వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? వారిలో మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి? అనే విషయాలను ఎంతో చక్కగా చూపించారు. అయితే పురాణాల్లో స్త్రీని మహాశక్తిగా, ఆదిపరాశక్తిగా చూపించారు. అయితే ఈ సినిమాలో స్త్రీ కూడా సాధారణ మనిషే అని చూపించారు. ఓ సీన్ లో సయనోరా ఫిలిప్ పాత్రతో ఓ డైలాగ్ చెప్పించారు. ‘నేను దైవాన్ని, సాధారణ స్త్రీనే’ అని ఆమె చెప్పే మాట ఆలోజింపచేస్తుంది.
నందిత చెప్పే క్లాస్ ఎంతో ఉపయోగంగా కనిపిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వాళ్లను ఎలా ఎత్తుకోవాలి, వాళ్లను ఎలా ఆడించాలి, బిడ్డ పుట్టిన తర్వాత ఎలా ఉండాలి అనే విషయాలను ఎంతో చక్కగా చూపించారు. ఒక బొమ్మతో డెమో చేసిన తర్వాత ఆ బొమ్మను తిరిగి ఇచ్చేందుకు పార్వతి తిరువొతు నిరాకరించే సన్నివేశం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమా మొత్తానికి ఈ సన్నివేశం, ఆమె నటనను హైలెట్ పాయింట్ గా చెప్పొచ్చు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటూ గర్భం దాలిస్తే ఏంటి పరిస్థితి? వారు ఎలా జీవిస్తారు అనే విషయాలను కూడా ఓ పాత్రతో చక్కగా చూపించారు. ఆ క్లాసులకు వేణికి తోడుగా రోజూ ఆమె అత్తగారు వస్తూ ఉంటారు. అయితే ఓ రోజు భర్తను తనతో క్లాసుకు రావాల్సిందిగా కోరుతుంది. అయితే అందుకు భర్త మా అమ్మని తీసుకెళ్లు అంటూ సమాధానం చెబుతాడు. అప్పుడు వేణి నేను వివాహం చేసుకుంది మిమ్మల్ని, మీ అమ్మను కాదు అంటూ బదులిస్తుంది. ఆ సన్నివేశం ఈ కాలంలో చాలా మంది భర్తలకు గుచ్చుకుంటుంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ సమయంలో భర్త తోడు భార్యకు ఎంత అవసరం అనేది అర్థమయ్యేలా చెప్పారు.
ఈ సినిమాలో ఏ ఒక్క పాత్రను తక్కువ చేయడానికి లేదు. ప్రతి ఒక్కరు వారి బెస్ట్ ని ఇచ్చారు. నదియా, నిత్యా మేనన్, పార్వతి, పద్మప్రియ ఇలా ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను బాగా రక్తి కట్టించారు. ప్రధాన పాత్రలు మాత్రమే కాదు.. వారికి సపోర్ట్ గా చేసిన వాళ్లు కూడా వారి పరిధి మేరకు చక్కగా నటించారు. రచయిత, డైరెక్టర్ ఒక స్త్రీ కావడంతో గర్భిణీలు పడే ఇబ్బందులు, వారి పరిస్థితులు, వారు భాగస్వామి, సొంతవారి నుంచి ఏం కోరుకుంటారు అనే విషయాన్ని అర్థమయ్యేలా చూపించగలిగారు అనిపిస్తుంది. సంగీతం, కెమెరా పనితనాన్ని కూడా ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి కథల అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఇప్పటితరం వాళ్లకు వారి బాధ్యతలను గుర్తుచేసేందుకు వండర్ ఉమెన్ సినిమా చక్కగా ఉపయోగపడుతుంది. అంజలి మేనన్ తన ప్రయత్నంలో తప్పకుండా సక్సెస్ అయ్యారనే చెప్పాలి.