Vikram Telugu Review & Rating: ఈ మధ్యకాలంలో సీనియర్ డైరెక్టర్స్ కంటే యంగ్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్డమ్ అందుకుంటున్నారు. రెండు మూడు సినిమాలకే పాన్ ఇండియా సినిమాలను తెరపై ప్రెజెంట్ చేస్తున్నారు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు ప్రస్తుతం ఆ జాబితాలోకి వస్తుంది. నగరం, ఖైదీ, మాస్టర్ లాంటి వరుస హిట్లతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న లోకేష్.. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందించాడు. కమల్ హాసన్ సినిమాకు చాలా ఏళ్ల తర్వాత మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి బిగ్ స్టార్స్ సపోర్టింగ్ రోల్స్ చేసేసరికి విక్రమ్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
మొత్తానికి లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వచ్చిన విక్రమ్ సినిమా.. ఎట్టకేలకు జూన్ 3న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన విక్రమ్ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఎంతమేరకు రీచ్ అయింది.. కమల్ హాసన్ ని విక్రమ్ సినిమా హిట్ ట్రాక్ లోకి తీసుకొచ్చిందా లేదా? విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ల నటన కమల్ హాసన్ స్థాయిని మరోస్థాయిలో ఎలివేట్ చేసిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం!
కథ:
ఒకరోజు రాత్రి చెన్నై నగరానికి చేరుకున్న పెద్ద కొకైన్ కంటైనర్ ఒకటి మిస్ అవుతుంది. ఆ కంటైనర్ చుట్టూ ఎంతోమంది బిగ్ షాట్స్ పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో ప్రభంజన్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ హత్యకు గురవుతాడు. ఆ తర్వాత చెన్నై నగరంలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. ఈ మర్డర్ మిస్టరీని ఛేజ్ చేసేందుకు పోలీస్ వారు స్పెషల్ ఆఫీసర్ అమర్(ఫాహద్ ఫాజిల్)కి ఈ కేసును అప్పగిస్తారు. తన అండర్ కవర్ టీమ్ తో అమర్ లోకల్ డ్రగ్ స్మగ్లర్ సంతానం(విజయ్ సేతుపతి) గురించి తెలుసుకుంటాడు. అయితే మర్డర్స్ చేస్తుంది మాస్క్ వేసుకున్న మనిషి కర్ణన్(కమల్ హాసన్) అని గ్రహిస్తాడు. అసలు కర్ణన్ కి ఏం కావాలి? సంతానం, కర్ణన్ ల గుట్టును అమర్ ఎలా కనిపెట్టాడు? వీరు ముగ్గురు ఎలా కలుసుకున్నారు? మధ్యలో విక్రమ్ ఎవరు? చివరికి ఎవరి కథను ఎవరు ముగించారు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
డార్క్ యాక్షన్ సినిమాలను తీయడంలో తాను దిట్ట అని ఇదివరకే ఖైదీ, మాస్టర్ సినిమాలతో ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు ఈ విక్రమ్ సినిమాను కూడా అదే జానర్ లో తీసాడు. విశ్వనటుడు కమల్ హాసన్ నటన గురించి మాట్లాడే స్థాయి ఎవరికి లేదు. ఆయన నటన స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు లోకేష్. ఓపెనింగ్ సీన్ తోనే ఇంటరెస్టింగ్ ఎపిసోడ్ తో విక్రమ్ ఫస్ట్ హాఫ్ మొదలయింది. మాస్క్ ధరించిన మనిషి ఎందుకు వరుస హత్యలు చేస్తున్నాడు అనేది చాలా సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. కర్ణన్ పాత్రలో కమల్ హాసన్ వేరే లెవెల్ లో రెచ్చిపోయారు. నిజానికి ఒకటి కాదు.. ఆయనలో దర్శకుడు చూపించిన వేరియేషన్స్ అన్నీ పీక్స్ లో ఉంటాయి.
అసలు హత్యలకు మాస్క్ మనిషికి సంబంధం ఏంటి? ఈ సీరియల్ మర్డర్స్ ని ఛేజ్ చేసేందుకు స్పెషల్ ఆఫీసర్ అమర్ తన బృందంతో ఎలాంటి ప్రణాళికలు వేసాడు.. స్టోరీలోకి డ్రగ్ స్మగ్లర్ సంతానం ఎలా ఎంటర్ అయ్యాడు.. అనే అంశాలను పరిచయం చేస్తూ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫస్ట్ హాఫ్ నడిపించాడు దర్శకుడు. ఇంటర్వెల్ సమయానికి అమర్ కి ఓ షాకింగ్ ట్విస్టు తెలుస్తుంది. అలాగే కథలోకి ఏజెంట్ విక్రమ్ జాయిన్ అవుతాడు. అమర్ – అతను వెతుకున్న మాస్క్ మ్యాన్ కర్ణన్ ఎదురుపడిన మాస్ యాక్షన్ బ్లాక్ తో ఇంటర్వెల్ ట్విస్టు ఇచ్చారు మేకర్స్.
ఇక సెకండాఫ్ లో ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్, అసలు విక్రమ్ ఇంట్రడక్షన్.. లతో మొదలై.. తన లక్ష్యం కోసం అడ్డొచ్చిన సంతానం స్మగ్లర్ లను ఎలా ఫేస్ చేశాడో ఆసక్తికరంగా చూపించాడు లోకేష్. ఇక ప్రీ-క్లైమాక్స్ లో కొన్ని దిమ్మతిరిగే ట్విస్టులు యాడ్ అవుతాయి. విక్రమ్ కథలోకి ఊహించని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతాయి. టోటల్ గా డార్క్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ నటన బ్యాక్ బోన్ అనే చెప్పాలి. యాక్షన్ సన్నివేషాలతో పాటు కమల్ ఎమోషన్స్, వేరియేషన్స్ ని అద్భుతంగా క్యాచ్ చేశాడు లోకేష్. కమల్ కి తోడు టాలెంటెడ్ స్టార్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ సినిమాకు మేజర్ హైలైట్స్. వాళ్ల క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన విధానం బాగుంది.
మొత్తంగా విక్రమ్ ఓ యాక్షన్ ప్యాకెడ్ థ్రిల్లర్ గా మేజర్ సక్సెస్ అందుకుందని చెప్పడంలో సందేహం లేదు. అయితే.. విక్రమ్ కథలో ఖైదీ సినిమా కథను ముడివేసిన విధానం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. ఖైదీలో కనిపించే పాత్రలు విక్రమ్ లో ఎదురవుతుంటాయి. ఇవన్నీ విక్రమ్ కి అదనపు బలాలుగా యాడ్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ విక్రమ్ లోకి ప్రతి క్యారెక్టర్ ని.. చాలా సాలిడ్ గా రాసుకున్నారు. కథాకథనాలలో మెయింటైన్ చేసిన ఇంటెన్సిటీ మెప్పిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మేజర్ ట్విస్టు హీరో సూర్య ఎంట్రీ.. గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే.. విక్రమ్ సినిమాకు యాక్టర్స్, డైరెక్టర్ తర్వాత సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బ్యాక్ బోన్స్ గా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ గిరి గంగాధరన్ ప్రతి సీన్ లో ఫ్రేమింగ్, లైటింగ్ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ని షూట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
ఇక అనిరుధ్ మ్యూజిక్ విక్రమ్ ని మరోస్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆదరగొట్టేసాడు. ఈ సినిమాకు అనిరుధ్ పాటలతో పాటు ప్రతి యాక్టర్ కి థీమ్స్ ఫుట్ టాపింగ్ రేంజిలో బిజీఎం మోగించాడు. కమల్ హాసన్ సొంత బ్యానర్ లో హై బడ్జెట్ తో నిర్మించిన విక్రమ్.. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. సినిమాలోని మిగతా పాత్రలన్నీ వాటి పరిధి మేర ఆకట్టుకున్నాయి. అయితే.. నిడివి పరంగా విక్రమ్ ఎక్కువ అనే ఫీల్ కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్, ట్విస్టులు, క్లైమాక్స్ సినిమాను ప్రేక్షకులు కదలకుండా చూసేలా చేసాయి. మొత్తానికి కమల్ హాసన్.. లోకేష్ కనగరాజ్ తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. చివరిగా విక్రమ్ కి సీక్వెల్స్ వచ్చినా ఆశ్చర్యపోయే అవసరం లేదు.
ప్లస్ లు:
కమల్ హాసన్, ఫాహాధ్ ఫాసిల్, విజయ్ సేతుపతి
స్టోరీ, స్క్రీన్ ప్లే
యాక్షన్ సీన్స్
మ్యూజిక్
డైరెక్షన్
మైనస్ లు:
అక్కడక్కడా స్లో సన్నివేశాలు
స్టోరీ ప్రెడిక్టబుల్ నెరేషన్
చివరి మాట: డార్క్ యాక్షన్ ఫ్యాన్స్ కి పండగే.. ఈ విక్రమ్!
రేటింగ్: 3/5
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!