ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లకు కూడా డిమాండ్ పెరిగింది. పైగా సినీ స్టార్స్ అంతా ఓటిటి వెబ్ సిరీస్ లవైపు ఆసక్తి చూపిస్తుండటంతో.. ప్రొడ్యూసర్స్ కూడా బడ్జెట్ పరంగా చొరవ తీసుకొని క్వాలిటీ సిరీస్ లను తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్/యాక్టర్ ఎస్.జే. సూర్య ప్రధానపాత్రలో ‘వదంతి’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. ‘విక్రమ్ వేద’ మూవీ డైరెక్టర్స్ గాయత్రీ-పుష్కర్ ఈ సిరీస్ ని నిర్మించగా.. డైరెక్టర్ ఆండ్రూ లూయిస్ తెరకెక్కించారు. ప్రస్తుతం వదంతి ట్రైలర్ ఓటిటి ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి వదంతి వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
ఈ సిరీస్ స్టోరీ వెలోని, రూబీ, ఎస్సై వివేక్ అనే క్యారెక్టర్ల చుట్టూ తిరుగుతుంది. కన్యాకుమారిలో ఓ లాడ్జి నడుపుతుంటుంది రూబీ(లైలా). భర్త చనిపోవడంతో ఒక్కగానొక్క కూతురు వెలోని(సంజన)ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తుంది. రూబీ కేరింగ్ చూసి కూతురు వెలోని.. తనను తల్లి అతిగా కంట్రోల్ చేస్తున్నట్లుగా భావించేది. అలాగే కూతురు వెలోని ప్రవర్తన చూసి.. మాట వినకుండా మొండిగా తయారైందని అసహనం వ్యక్తం చేస్తుండేది రూబీ. ఈ క్రమంలో ఎంతోకాలంగా తమ లాడ్జిలో ఉంటున్న విగ్నేష్(కుమారన్)కి కూతురు వెలోనిని ఇచ్చి పెళ్లి చేయాలని రూబీ అనుకుంటుంది.
కట్ చేస్తే.. ఓరోజు మేనత్త ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుండి బయటికి వెళ్తుంది వెలోని. అదే ప్రాంతంలో షూటింగ్ కోసం వచ్చిన ఓ బృందం.. తమతో వచ్చిన హీరోయిన్ మమత చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసుల విచారణలో చనిపోయింది మమత కాదని.. వెలోని అని షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. దీంతో కొన్ని ఊహించని పరిణామాల మధ్య వెలోని మర్డర్ కేసు ఎస్సై వివేక్(SJ సూర్య) చేతికి చేరుతుంది. ఆ తర్వాత ఎస్సై వివేక్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటపడతాయి. మరి వెలోని ఎలా చనిపోయింది? వెలోనిని మర్డర్ చేసింది ఎవరు? మరి షూటింగ్ కోసం వచ్చిన హీరోయిన్ మమత ఏమైపోయింది? ఈ కేసులో ఎస్సై వివేక్ ఎలాంటి సవాళ్లు ఫేస్ చేశాడు? చివరికి ఏమైంది? అనేది సిరీస్ లో చూడాల్సిందే.
చిత్రపరిశ్రమలో మర్డర్ మిస్టరీస్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కి ఎప్పటినుండో క్రేజ్ ఉంది. పైగా రొటీన్ మాస్ మసాలా, కమర్షియల్, లవ్ స్టోరీస్ చూసి విసుగెత్తిపోయిన ప్రేక్షకులకు థ్రిల్లర్ సినిమాలు, సిరీసులే కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ మధ్యకాలంలో ఓటిటి ప్లాట్ ఫామ్స్ వచ్చాక థ్రిల్లర్ సిరీస్ లను బాగా ఆదరిస్తున్నారు ఆడియెన్స్. అలా క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.. ఈ వదంతి వెబ్ సిరీస్. జనరల్ గా థ్రిల్లర్స్ అంటే.. కథ బలంగా లేకపోయినా, స్క్రీన్ ప్లే – థ్రిల్లర్ ఎలిమెంట్స్ – ట్విస్టులు బలంగా ఉండాలి. అంతే.. ఇవి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ నుండి చివరివరకు ప్రేక్షకులను సీట్స్ లో కూర్చోబెట్టవచ్చు అంటుంటారు.
ఇక ఈ వదంతి వెబ్ సిరీస్ ని మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేశారు మేకర్స్. స్టోరీ లైన్ కొత్తగా ఉంటుంది.. కాకపోతే దాదాపు మర్డర్ మిస్టరీస్ అన్నింటిలో కనిపించే కామన్ పాయింట్స్ ఇందులో కూడా రిపీట్ అవుతాయి. కానీ.. దర్శకుడు ఆండ్రూ లూయిస్ తాను రాసుకున్న స్టోరీకి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంది. మొదటి రెండు ఎపిసోడ్స్ వరకు నార్మల్ గా సాగిన సిరీస్ ని.. మూడో ఎపిసోడ్ నుండి ఒక్కసారిగా స్పీడప్ చేశాడు. కథ ఎలా ఉన్నా.. స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గా ఉంటే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేరు. ఈ విషయాన్నీ దర్శకుడు లూయిస్ బాగా క్యాచ్ చేశాడు.. అందుకే స్క్రీన్ ప్లేలో డిఫరెంట్ లేయర్స్ యాడ్ చేసి థ్రిల్లింగ్ గా ప్రెజెంట్ చేశాడు.
కన్యాకుమారిలో రూబీ(లైలా) లాడ్జి రన్ చేయడం.. ఆమె కూతురు వెలోని(సంజన).. అదే లాడ్జిలో ఉంటున్న విగ్నేష్.. ఇలా ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వదంతి కథ మొదలవుతుంది. అలా రూబ, వెలోనిల రెగ్యులర్ లైఫ్.. అదే ఏరియాలో సినిమా షూటింగ్ కోసం వచ్చిన బృందం.. మరోవైపు ఫారెస్ట్ ఏరియా కాబట్టి.. ఎప్పుడేం జరుగుతుందో అనే ఆసక్తిని క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. ఒక్కో ఎపిసోడ్ ముందుకు వెళ్తున్నకొద్దీ.. కథాకథనాలు కొత్త మలుపులు తీసుకుంటూ థ్రిల్ కలిగిస్తాయి. మామూలుగా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో పోలీసుల హడావిడి, డ్రామా ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ఎలాంటి హడావిడి లేకుండా కూల్ గా ప్రెజెంట్ చేయడం ప్లస్ పాయింట్.
కొన్నిసార్లు థ్రిల్లర్స్ అనేవి ఫారెస్ట్ ఇన్వాల్వ్ మెంట్ లేకుండా రావేమో అనిపిస్తుంటాయి. ఎందుకంటే.. అడవి ప్రాంతంలో లాడ్జి నడుపుకుంటూ ఉండే రూబీ కూతురు వెలోని.. అదే ఫారెస్ట్ లో నిర్మానుష్యమైన ప్రదేశంలో శవమై కనిపించడం మైండ్ బ్లాక్ చేస్తుంది. కానీ.. అప్పటికే హీరోయిన్ మమత చనిపోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో.. కథలో మరింత ఉత్కంఠ మొదలవుతుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ లో నెక్స్ట్ ఏం జరగబోతుంది? అనే ఆసక్తిని అలాగే మెయింటైన్ చేశాడు దర్శకుడు. అయితే.. ఎస్సై వివేక్ క్యారెక్టర్(ఎస్.జే. సూర్య) కేసులోకి ఎంటర్ అయ్యాక ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అలాగే వెలోని కేసు దర్యాప్తులో ఎస్సై వివేక్ కి ఇంకా ఎన్నో షాకింగ్ విషయాలు తెలిసే సీన్స్ బాగా డిజైన్ చేశారు.
ఎస్సై వివేక్.. వెలోని కేసును చాలా సీరియస్ గా తీసుకొని విచారణ చేయడం.. ఆ విచారణలో రైటర్ సెబాస్టియన్, టోనీ లాంటి మరికొన్ని ఊహించని క్యారెక్టర్స్ ఎంటరై షాక్ కలిగిస్తాయి. అక్కడినుండి అందరినీ అనుమానించడం మొదలు పెడతాడు. కానీ.. ఈ కేసులో ఉన్నవారంతా బలమైన బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్నారని.. ఎలాగైనా వారిని పట్టుకోవాలని వివేక్ చేస్తున్న ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు.. అటు పొలిటికల్ గా, ఇటు ప్రొఫెషనల్ గా కూడా ఫేస్ చేసే సీక్వెన్సులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఓవైపు వెలోని కేసు, మరోవైపు విచారణలో తేలే షాకింగ్ విషయాలు.. ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తాయని చెప్పాలి. వెలోని హత్య వెనుక ఒక్కో క్యారెక్టర్ పై అనుమానాన్ని రేకెత్తిస్తూ.. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్టులు ఎక్సపెక్ట్ చేయలేకుండా ఉండటం మరో విశేషం.
దర్శకుడు ఆండ్రూ లూయిస్ కథాకథనాలు చాలా క్లారిటీగా, క్యారెక్టర్స్ ని నేచురల్ గా రాసుకున్నాడు. కాకపోతే.. అక్కడక్కడా రెగ్యులర్ సీన్స్ ఎదురవుతూనే ఉంటాయి. ఈ సిరీస్ కి శరవణన్ రామస్వామి సినిమాటోగ్రఫీ, సిమోన్ కే. కింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ అనే చెప్పాలి. ఫారెస్ట్ లో లొకేషన్స్ బాగా కాప్చర్ చేశారు. ఎడిటర్ కూడా కథను కన్ఫ్యూజ్ చేయకుండా సాగించాడు. ఇందులో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్ మెంట్.. పై అధికారుల ఒత్తిళ్లు.. చుట్టూ ఎన్నో అనుమానాలు.. ఇలా అన్నీ తట్టుకుని నిలబడే పోలీస్ ఆఫీసర్ వివేక్ క్యారెక్టర్ లో ఎస్.జే. సూర్య అదరగొట్టేశాడు.
స్టార్టింగ్ రెండు ఎపిసోడ్స్ లైట్ తీసుకునే మూడో ఎపిసోడ్ నుండి చివరివరకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ మిస్టరీ థ్రిల్లర్ లో ఎస్.జె సూర్యతో పాటు కీలక పాత్రలు పోషించిన లైలా, సంజన, నాజర్, స్మృతి వెంకట్, వివేక్ ప్రసన్న తదితరులు క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. మరి మంచి థ్రిల్ కలిగించే వెబ్ సిరీస్ కోసం ఎదురు చూసేవారిని ఈ వదంతి సిరీస్ ఆకట్టుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మధ్యలో కొన్ని ఊహించని సన్నివేశాలు ఫ్యామిలీతో చూడటం కష్టమే కావచ్చు. కానీ.. ఈ వీకెండ్ కి అమెజాన్ ప్రైమ్ లో ‘వదంతి: ది ఫేబుల్ ఆఫ్ వెలోని’ సిరీస్ చూసి చిల్ అవ్వచ్చు. చూడాలి మరి ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో!