సంక్రాంతి అంటే సినిమాల సందడి ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈ ఏడాది కూడా చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు రెండు తమిళ డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో ఫస్ట్ నుంచి హాట్ టాపిక్ గా నిలిచిన చిత్రం ‘వారసుడు’. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తమిళంలో జనవరి 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. తెలుగులో మాత్రం శనివారం రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
మైనింగ్ లో సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్ర(శరత్ కుమార్)కు జై(శ్రీకాంత్), అజయ్(కిక్ శ్యామ్), విజయ్ (విజయ్) అని ముగ్గురు కొడుకులు. అంచెలంచెలుగా ఎదిగిన రాజేంద్ర తన కంపెనీకి వారసుడిని ప్రకటించాలని, విదేశాల్లో చదువుతున్న విజయ్ ని ఇంటికి పిలుస్తాడు. ఇదంతా ఇష్టం లేని విజయ్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. కొన్నేళ్లపాటు ఒంటరిగా బతుకుతాడు. మరోవైపు రాజేంద్ర, అతడి సామ్రాజ్యాన్ని నాశనం చేయాలని జయప్రకాశ్(ప్రకాష్ రాజ్) చూస్తుంటాడు. మరి చివరకు ఏం జరిగింది? హీరో ఫ్యామిలీలో అందరూ ఒక్కటయ్యారా లేదా అనేది తెలియాలంటే థియేటర్లలో ఉన్న ‘వారసుడు’ చూడాల్సిందే.
‘వారసుడు’ ట్రైలర్ చూస్తే.. ఎవరికైనా సరే స్టోరీ ఇట్టే అర్థమైపోతుంది. ఓ తండ్రి, ముగ్గురు కొడుకులు, తండ్రి ఆశయాలకు అడ్డుపడే విలన్, స్వార్థంతో వెళ్లిపోయే అన్నదమ్ములు, కుటుంబాన్ని ఒక్కటి చేస్తూ విలన్ ని మట్టుపెట్టే హీరో.. ఈ తరహా స్టోరీ తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. మూసధోరణిలో ఉన్న ఈ కథని వంశీ పైడిపల్లి రాయడం, దాన్ని తమిళ స్టార్ హీరో విజయ్ చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఫస్టాప్ లో హీరో, అతడి కుటుంబాన్నే దాదాపుగా చూపించారు. విసుక్కోవడాలు, చిన్నచూపు చూడటం లాంటివి వాటిని డిజైన్ చేసుకున్నారు. ఇలాంటి సీన్స్ ఇప్పటికే చాలాసార్లు చూశాం. అయితే విజయ్ ని ఈ సీన్స్ లో చూడటం కాస్త కొత్తగా అనిపించింది. అయితే తెలుగు ఆడియెన్స్ కి ఇవన్నీ మైండ్ లో ఎక్కుతాయనుకోవడం కష్టమే!
ఇక సెకండాఫ్ విషయానికొస్తే.. కామెడీ, విజయ్ హీరోయిజంతో లాగించేశారు. మధ్య మధ్యలో కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉండటంతో ఇంటర్వెల్ తర్వాత అన్ని మిక్స్ చేసిన కాక్ టెయిల్ లా అనిపిస్తుంది. అయితే సీన్స్ కూడా చాలా నేచురల్ గా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. కాస్త ఓల్డ్ ఫ్యాషన్ లా అనిపించినా సరే ఈ సినిమాలో తానెంటో తాను తెలుసుకోవడం, కుటుంబం అనుబంధాలు, కుటుంబానికి మనమేం తిరిగి ఇవ్వగలం, ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇవ్వడం లాంటి సింపుల్ ఎలిమెంట్స్ చుట్టూనే మూవీ తిరుగుతుంది. సెకండాఫ్ లో వచ్చే రొమాన్స్, విలన్ ట్రాక్ ఇవన్నీ కూడా ఎక్స్ ట్రా ఎలిమెంట్స్ మాత్రమే. అయితే ఇక్కడ దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన మంచి పని ఏంటంటే.. విజయ్ పాత బ్లాక్ బస్టర్ సినిమాలను గుర్తుచేసేలా కొన్ని సీన్స్ ని డిజైన్ చేశారు. అవి చూస్తున్నప్పుడు విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మిగతా ప్రేక్షకులకు మాత్రం ఆ స్థాయిలో ఎంజాయ్ చేయలేరు.
‘వారసుడు’ మూవీని విజయ్ కోసమే రాసుకున్నారు. అందుకు తగ్గట్లే మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. విజయ్ లుక్స్ సూపర్ గా ఉన్నాయి. తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యేలా పంచులు, యాక్టింగ్, మాస్ సీన్స్ తో విజయ్ అదరగొట్టాడు. రష్మిక కొన్ని సీన్స్, పాటలకు పరిమితమైంది. ఇక విజయ్ అమ్మగా చేసిన జయసుధ ఎప్పటిలానే సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లడానికి సహాయపడింది. శరత్ కుమార్ తన రోల్ కు న్యాయం చేశాడు. ప్రకాష్ రాజ్ విలనిజం చూస్తుంటే పాత విలన్ గుర్తొచ్చాడు. ఉన్నంతలో శ్రీకాంత్ మెప్పించాడు. అతడి క్యారెక్టర్ ని ఇంకాస్త బాగా డిజైన్ చేసుంటే బాగుండేది. కిక్ శ్యామ్ కు సెకండాఫ్ లో ఎక్కువ స్కోప్ దక్కింది. ఎస్.జే సూర్య కనిపించేది కాసేపే అయినా సరే హైలెట్ ఫెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.
ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ వంశీ పైడిపల్లి గురించి.. వేరే ఏవి కాకుండా కేవలం విజయ్ ఫ్యాన్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపించాడు. అందుకు తగ్గట్లే ఎలివేషన్స్, సీన్స్ రాసుకొన్నాడు. కథ విషయంలో పెద్దగా ఆలోచించలేకపోయాడు. ఇక తమన్ విషయానికొస్తే.. రెండు సాంగ్స్ బాగున్నాయి. మిగతా పాటలు పర్వాలేదనిపించాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోరు మాత్రమే అదరగొట్టేశాడు. చెప్పాలంటే తమన్ తన మార్క్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు తమన్ ని కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. పాటల్లో, క్లైమాక్స్ లో అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఎడిటింగ్ కూడా బాగుంది. ప్రతి సీన్ లోనూ దిల్ రాజు నిర్మాణ విలువలు కనిపించాయి. ఓవరాల్ గా చూస్తే విజయ్ సినిమాలని ఇష్టపడే వారికి నచ్చుతుంది. మిగిలిన వాళ్లకు మాత్రమే ఇంకా ఈ పాత కథలు ఎన్నాళ్లురా అనిపిస్తుంది!
చివరగా: విజయ్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే… ‘వారసుడు’!
రేటింగ్: 2/5