ప్రతి వారం ఓటీటీలో చాలా సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని ఎంటర్ టైన్ చేస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు రియల్ గా జరిగిన సంఘటనల్ని కూడా తెరకెక్కిస్తుంటారు. వాటిలోనే ఓటీటీలో మాత్రమే విడుదల చేస్తుంటారు. వాటి గురించి పెద్దగా బజ్ ఉండదు గానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయంలో మాత్రం ఏ మాత్రం డిసప్పాయింట్ చేయవు. అలాంటి కథతో వచ్చిన వెబ్ సిరీస్ ‘ట్రయిల్ బై ఫైర్’. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ లోనే అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!
అది 1997 జూన్ 13, దిల్లీలోని ఉపహర్ థియేటర్. ‘బోర్డర్’ రిలీజ్ డే. భారత్-పాక్ యుద్ధం నేపథ్య కథతో తీసిన ఈ సినిమాను విడుదలైన రోజే చూడాలని చాలామంది వెళ్తారు. శేఖర్ (అభయ్ డియోల్), నీలం (రాజశ్రీ దేశ్ పాండే) పిల్లలు ఉజ్వల్, ఉన్నతి కూడా ఇందులో ఉంటారు. సినిమా ప్రారంభమైన కాసేపటికే.. థియేటర్ లోని ట్రాన్స్ ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగుతాయి. థియేటర్ అంతా పొగలు. ప్రేక్షకులందరూ కూడా ఎవరికివారు బయటకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట, ఊపిరాడక దాదాపు 59మంది ప్రాణాలు కోల్పోతారు. అయితే ఇది మనుషుల వల్ల జరిగిన ప్రమాదం అని తెలుసుకున్న శేఖర్-నీలం.. న్యాయం కోసం పోరాడుతారు? మరి కోటీశ్వరులైన అన్సల్ బ్రదర్స్ తో జరిగిన న్యాయపోరాటంలో వీళ్లు ఎంత వరకు వెళ్లారు? చివరకు న్యాయం గెలిచిందా లేదా అనేది తెలియాలంటే ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ చూడాల్సిందే.
మన దేశంలో న్యాయ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోటీశ్వరులు, రాజకీయ నాయకులు.. తమ పరపతి, డబ్బు ఉపయోగించి న్యాయం నుంచి ఎలా తప్పించుకుంటున్నారో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ సిరీస్ లో కూడా అదే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఎక్కడా కూడా అస్సలు పక్కదారి పట్టకుండా.. 1997లో ఏం జరిగిందో దాన్నే చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. తొలి ఎపిసోడ్ లో ‘ఉపహర్’ ఉదంతం జరగడం, అందులో శేఖర్-నీలం పిల్లలు ఉజ్వల్,ఉన్నతి చనిపోవడాన్ని చూపించారు. రెండో ఎపిసోడ్ లో ప్రధాన పాత్రధారి నీలం ఒక్కో ఆధారాన్ని కలెక్ట్ చేసుకోవడానికి చూపించారు. ఇలా తొలి రెండు ఎపిసోడ్స్ శేఖర్-నీలం ఫ్యామిలీనే ప్రధానంగా చూపించారు.
ఇక మూడు ఎపిసోడ్ నుంచి మాత్రం స్టోరీ పరుగెడుతుంది. అసలేం జరిగింది? దీనికి ఎవరెవరు బాధ్యలు అనే విషయాన్ని ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ వస్తారు. ఈ క్రమంలోనే నలుగైదు స్టోరీలు ఎట్ ఏ టైంలో మనకు కనిపిస్తుంటాయి. అలానే ‘ఉపహర్’ సంఘటన జరిగిన రోజు నుంచి దాదాపు 20 ఏళ్లపాటు ఈ కేసు నడుస్తుంది. రియల్ లైఫ్ లో మధ్య తరగతి, పేదోడికి న్యాయం దక్కదో ఇందులో కూడా అదే జరుగుతుంది. శేఖర్-నీలం దంపతులు అన్నేళ్ల పాటు పోరాడినా సరే కేసులో పెద్దగా పురోగతి కనిపించదు. సమాజంలోనూ పెద్దగా ఏం మార్పు రాదు. ఈ విషయాన్నే మనకు చాలా సీన్స్ లో చూపించారు. అలానే థియేటర్స్, మాల్స్ లో ఫైర్ అండ్ సేఫ్టీ విషయంలోజాగ్రత్తలు పాటించకపోవడం, వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండటాన్ని కూడా ప్రస్తావిస్తారు.
ఇక ఈ సిరీస్ లో మనసుని మెలిపెట్టే సీన్స్ కూడా చాలానే ఉంటాయి. ఈ సంఘటన జరిగిన 18 ఏళ్ల తర్వాత ఉజ్వల్ ఫ్రెండ్ అర్జున్ వాళ్ల ఇంటికి శేఖర్-నీలం దంపతులు వెళ్తారు. యాక్చువల్లీ.. ‘ఉపహర్’ సంఘటన జరిగిన రోజు అర్జున్ కూడా ఉజ్వల్, ఉన్నతిలతో కలిసి సినిమాకు వెళ్లాలి. కానీ లేట్ కావడంతో బయటే ఉండిపోతాడు. ప్రాణాలతో బయటపడతాడు. అదే అర్జున్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి సైలెంట్ గా చనిపోయిన తమ పిల్లల్ని గుర్తుకుతెచ్చుకుని లోలోపల బాధపడతారు. తొలి ఆరు ఎపిసోడ్స్ కోర్టు డ్రామా, ఫ్యామిలీ డ్రామా చూపిస్తారు. చివరి ఎపిసోడ్ లో మాత్రం అసలు సంఘటన రోజు ఏం జరిగిందనే దాన్ని క్లియర్ గా చూపించారు. కొన్ని విషయాల్ని మాత్రం అలా క్వశ్చన్స్ గానే వదిలేశారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం.. ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన తమ పిల్లల కోసం శేఖర్-నీలం దంపతులు చేసే పోరాటం మిమ్మల్ని కచ్చితంగా ఎమోషనల్ చేస్తుంది.
ఏడు ఎపిసోడ్స్ లో మనకు ఎక్కువగా కనిపించేది శేఖర్-నీలం పాత్రలే. వీటిలో నటించిన అభయ్ డియోల్, రాజశ్రీ దేశ్ పాండే నటించారు అనడం కంటే జీవించేశారని చెప్పాలి. మొత్తం సిరీస్.. దాదాపు 20 ఏళ్ల టైంలైన్ లో ఉంటుంది. అలా తమ తమ పాత్రలతో వేరియేషన్స్ చూపించారు. ఆశిష్ విద్యార్థి కూడా ఓ రెండు మూడు ఎపిసోడ్స్ లో కనిపిస్తాడు. మన వరకు అయితే అతడు మాత్రమే తెలుసు. మిగతా వాళ్లందరూ కూడా హిందీ నటులే ఉంటారు. ఆయా పాత్రలకు ఆయా నటీనటులు పూర్తి న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సిరీస్ తగ్గట్లే ఉన్నాయి. డైరెక్టర్స్ ప్రశాంత్ నాయర్(7 ఎపిసోడ్స్), రణ్ దీప్ ఝా(4 ఎపిసోడ్స్), అవని దేశ్ పాండే(1 ఎపిసోడ్).. తమ వరకు న్యాయం చేశారు. కోర్టు రూమ్ డ్రామాని తమ డైరెక్షన్ తో రక్తి కట్టించారు. ఒకవేళ మీరు గనక సీరియస్ డ్రామా చూడాలనుకుంటే మాత్రం తెలుగులోనే ఉన్న ‘ట్రయల్ బై ఫైర్’ సిరీస్ ని ట్రై చేయొచ్చు.
చివరగా: కోర్టు రూం డ్రామాస్ ఇష్టపడే వారికోసమే ఈ ‘ట్రయల్ బై ఫైర్’!
రేటింగ్: 2.5