లవర్ బాయ్ సిద్ధార్థ్ తాజా చిత్రం టక్కర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ సినిమా సక్సెస్ సాధించిందా?
నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయ్యారు హీరో సిద్ధార్థ్. లవర్ బాయ్ ఇమేజ్‌తో తెలుగులో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. బొమ్మరిల్లు సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయారు. మాతృభాష తమిళంతో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేశారు. తెలుగులోనూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన నేరుగా తెలుగులో తీసిన సినిమాలు ప్లాపులు అవుతున్న నేపథ్యంలో ఆయన తమిళ సినిమాలకే ఎక్కువగా పరిమితం అయ్యారు.
చాలా ఏళ్ల తర్వాత 2021లో మహా సముద్రం సినిమాతో తెలుగులో నేరుగా సినిమా చేశారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. దీంతో తెలుగులో సినిమాలు చేయటం మానుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అవి కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించటం లేదు. ఇలాంటి సమయంలో విజయమే లక్ష్యంగా.. టక్కర్ సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చారు. మరి, ఈ సినిమా సిద్ధార్థ్‌కు విజయాన్ని తీసుకువచ్చిందా? ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?
గుణశేఖర్ ( సిద్ధార్థ్) ఓ నిరుపేద కుటుంబానికి చెందిన అబ్బాయి. చిన్న తనం నుంచి అతడు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొంటూ వస్తాడు. తన జీవితంలో ఇన్ని కష్టాలు, అవమానాలు రావటానికి కారణం పేదరికమే అని భావిస్తాడు. ఎలాగైనా కోట్లు సంపాదించాలని అనుకుంటాడు. వైజాగ్‌లోని ఓ చైనా వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా చేరుతాడు. అయితే, తన కారుకు యాక్సిడెంట్ చేశాడన్న కారణంతో ఆ చైనా వ్యక్తి గుణశేఖర్‌ను బాగా అవమానిస్తాడు. సిద్ధార్థ్ ఆ అవమానం భరించలేకపోతాడు. బాధతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఇందుకోసం నగరంలో పేరు మోసిన క్రిమినల్ రాజ్( అభిమన్యు సింగ్) అడ్డాకు వెళతాడు. అక్కడ అతడి జీవితం మలుపు తిరుగుతుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల గుణశేఖర్ రాజ్ అడ్డాలోని రౌడీల్ని కొడతాడు. అక్కడ ఉన్న కారు తీసుకుని వెళ్లిపోతాడు. కొద్దిసేపటికి ఆ కారు డిక్కీలో ఓ యువతి కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా యువతి? ఆ కారు డిక్కీలోకి ఆమె ఎందుకు వచ్చింది? ఆమె రాకతో గుణ జీవితం ఎలా మారిందన్నదే కథాంశం.
పేదింటి కుర్రాడు అడ్డదారుల్లో కోటీశ్వరుడు కావాలనుకోవటం అన్న లైన్‌తో చాలా సినిమాలు వచ్చాయి. నిజానికి కథలో కొత్తదనం ఎక్కడా లేదు. ఓ మసాలా సినిమాకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికి.. సినిమా ప్రేక్షకులను మెప్పించటంలో ఫేయిల్ అయింది. సినిమా మొదలైన ఓ 20 నిమిషాలు చాలా చక్కగా సాగుతుంది. ఇక, ఆ తర్వాతి నుంచి సినిమా చూడాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. క్యారెక్టర్లను తీర్చిదిద్దడంలోనూ దర్శకుడు విఫలం అయ్యాడు. యాక్షన్, ప్రేమ ఉన్నప్పటికి రెండూ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. విలన్ ఎంత బలమైన వాడు అయితే.. హీరో అంత బలమైన వాడు అవుతాడు అంటారు. కానీ, ఈ సినిమాలో విలన్ పాత్ర డమ్మీగా ఉంటుంది. ఇద్దరి మధ్యా ఫైట్ సీన్లు పిల్లల ఫైట్‌లాగా అనిపిస్తాయి. కామెడీ పరంగా కూడా సినిమా ఓ మెస్తరు అనిచెప్పొచ్చు. క్లైమాక్స్‌ను ఎండ్ చేయటంలో దర్శకుడు విఫలం అయ్యాడు.
గుణశేఖర్‌గా సిద్ధార్థ్ నటన ఆకట్టుకుంటుంది. తన నటనతో సిద్ధార్థ్ గుణ శేఖర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. హీరోయిన్‌గా దివ్యాన్ష కౌశిక్ నటన కూడా అందరినీ మెప్పిస్తుంది. ఆమె తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బోల్డ్ సీన్లలో కూడా దివ్యాన్ష ఎలాంటి హద్దులు లేకుండా నటించారు. విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ కూడా చక్కగా నటించారు. దర్శకుడి పొరపాటో లేక అభిమన్యు సింగ్‌కు ఆ విలన్ పాత్ర సెట్ కాకపోవటమే తెలీదు కానీ, అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఇక, కామెడీ పరంగా యోగిబాబు కొంత మేరకు సక్సెస్ సాధించారు.
కథ, కథనం, దర్శకత్వం విషయంలో సినిమా ఫెయిల్ అయినా.. నిర్మాణ విలువల విషయంలో మాత్రం పర్లేదు అనిపించింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా నివాస్. కే ప్రసన్న పనితీరు బాగుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. పాటలు కూడా పర్లేదు అనిపించాయి. వచ్చినాధాన్ మురిగేషన్ సినిమాటోగ్రఫీ సినిమా చక్కగా ఉంది. ప్రతీ ఫ్రేము మంచిగా చూపించడానికే ఆయన ప్రయత్నించారు. యాక్షన్ సన్నివేశాల టేకింగ్ అద్భుతంగా ఉంటుంది.
చివరి మాట: టక్కర్ ప్రయాణం బోరు కొట్టుచ్చు!
రేటింగ్: 2/5